తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీకి మ‌రోషాక్ త‌గిలింది. ఇప్ప‌టికే...వేళ్ల మీద లెక్కించే స్థాయిలో ఉన్న ముఖ్య‌నేత‌ల్లో మ‌రొక‌రు గుడ్‌బై చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, ఆమె తనయుడు డాక్టర్ మల్లిఖార్జున్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథ‌మిక సభ్యత్వానికి, రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు అన్నపూర్ణమ్మ వెల్ల‌డించారు. ప్రాథ‌మిక సభ్యత్వంతో పాటుగా బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి పదవికి రాజీనామా చేసిన‌ట్లు ఆమె త‌న‌యుడు డాక్టర్ మల్లిఖార్జున్ రెడ్డి ప్ర‌క‌టించారు.


తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన అనంత‌రం మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, ఆమె తనయుడు డాక్టర్ మల్లిఖార్జున్ రెడ్డి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ...తెలంగాణలో ప్రజలు తెలుగుదేశం పార్టీని విశ్వసించడం లేదని స్ప‌ష్టం చేశారు. సమకాలీన రాజకీయాలలో కొనసాగాలంటే  కార్యకర్తలు, ప్రజల మనోభావాలకు అనుకూలంగా వ్యవహరించాలని పేర్కొంటూ అందుకే...తెలుగుదేశం పార్టీ ప్రాథ‌మికి సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేశామ‌న్నారు. రాజీనామా పత్రాన్ని  మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు  చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ ద్వారా పంపించామ‌ని పేర్కొన్నారు. 


కాగా, అన్న‌పూర్ణ‌మ్మ స‌తీమ‌ణి ఏలేటి మహిపాల్ రెడ్డి  తెలుగుదేశం పార్టీ  ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ నాయకత్వంలో  ఎమ్మెల్యేగా, మంత్రిగా, సమితి అద్యక్షుడిగా, జిల్లా పార్టీ అద్యక్షునిగా పనిచేశారు. మహిపాల్ రెడ్డి హఠాన్మరణం తర్వాత అన్న‌పూర్ణ‌మ్మ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అనంత‌రం కూడా పార్టీలోనే కొన‌సాగిన‌ప్ప‌టికీ...తెలుగుదేశం పార్టీకి భ‌విష్య‌త్ లేక‌పోవ‌డంతో వారు రాజీనామా చేశారు. కాగా, వారు బీజేపీలో చేర‌నున్న‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే నిజామాబాద్‌లో ముఖ్య‌నేతంలంతా పార్టీకి గుడ్‌బై చెప్పేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌లో ఉన్న స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు గంప గోవర్ద‌న్‌,హ‌న్మంత్ షిండే, సీనియ‌ర్ నేత మండవ వెంక‌టేశ్వ‌ర్‌రావు త‌దిత‌రులంతా...గ‌తంలో జిల్లాలో టీడీపీ త‌ర‌ఫున ప్ర‌జాప్ర‌తినిధులుగా వ్య‌వ‌హ‌రించారు. అయితే, తెలుగుదేశం అడ్ర‌స్ గ‌ల్లంత‌వ‌డంతో..వారు టీఆర్ఎస్ గూటికి చేరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: