తిరుమలలో సిఫార్సు లేఖలు అడ్డదారి పడుతున్నాయి. దళారులుకు కాసుల పంట పండిస్తున్నాయి. దీంతో వాటిని నియంత్రించేందుకు త్రిశూల వ్యూహంతో అడుగులు వేస్తోంది టీటీడీ. తిరుమల కొండపై ఏళ్లతరబడి పాతుకుపోయిన దళారి వ్యవస్థకు చెక్ పెట్టేందుకు సిద్దమైంది టీటీడీ. మూడు విధాలుగా దళారులుకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు అధికారులు. సిఫార్సు లేఖలపై టికెట్లు పొంది భక్తులకు అధిక మొత్తంలో విక్రయిస్తున్న సమయంలో వారిని  అదుపులోకి తీసుకొని బలమైన సెక్షన్‌లు నమోదు చేయడం. దళారులు సిఫార్సు లేఖలు ఎలా పొందుతున్నారో గుర్తించి వాటిని అరికట్టడం. భక్తులు దళారులును ఆశ్రయించకుండా ఉండేందుకు  బ్రేక్ దర్శనాలు సిఫార్సు లేఖలు లేకూండానే అందుభాటులోకి తీసుకురావడం. త్రిముఖ వ్యూహంతో కార్యాచరణ మొదలుపెట్టింది టీటీడీ.   


ప్రజాప్రతినిధులు, పిఆర్వోల ముసుగులో ఉన్న దళారుల భరతం పట్టేందుకు టీటీడీ అధికారులు నిఘా పెట్టారు. భక్తులు దర్శనానికి వెళ్ళే సమయంలో వారిని ప్రశ్నిస్తూ దళారులును అదుపులోకి తీసుకుంటున్నారు. తనిఖీల్లో భాగంగా నిన్న పట్టుబడిన ఓ దళారి... 65 రోజులలో  185 సిఫార్సు లేఖలపై టికెట్లు పొంది విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. 46 మంది ప్రజాప్రతినిధులు, అధికారుల పేరిట సిఫార్స్ లేఖలు పొందాడంటే ఏ రేంజ్‌లో అక్రమాలు జరుగుతున్నాయో అర్థమవుతోంది. 


దళారులకు చెక్ పెట్టేందుకు  టీటీడీ శ్రీవాణి పథకాన్ని వినియోగిస్తోంది.  శ్రీవాణి పథకానికి 10 వేల రూపాయలు విరాళంగా అందజేసిన భక్తులకు విఐపి బ్రేక్ దర్శనభాగ్యం కల్పిస్తుంది. ఎలాంటి సిఫార్సు లేఖ లేకూండానే వీఐపీ ప్రోటోకాల్ దర్శన భాగ్యం లభిస్తుండడంతో... భక్తులు నేరుగా టిటిడి పథకానికే డబ్బు చెల్లించవచ్చు. తద్వారా విరాళాలు పెరగడంతో పాటు.. శ్రీవారికి కానుక సమర్పించామన్న తృప్తి భక్తులకు ఉంటుంది.  10 రోజులలో 533 మంది భక్తులు శ్రీవాణి పథకానికి విరాళాలు అందించారు. నిన్న ఒక్కరోజే 153 మంది శ్రీవాణి ట్రస్ట్ కి విరాళం అందజేసారు. ఇలా దళారి వ్యవస్థను అరికట్టేందుకు అన్ని వైపులా చర్యలు తీసుకుంటుంది టీటీడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: