ఏపీలో ఇసుక సంక్షోభంపై జనసేన నాయకుడు పవన్‌ కల్యాణ్‌ తలపెట్టిన 'లాంగ్ మార్చ్'కు మొత్తానికి చాలా అడ్డంకులను తొలగించుకొని అనుమతి లభించింది. ఏపీలో ఇసుక కొరత వల్ల ఉపాధి కరువైందని.. భవన నిర్మాణ రంగం కుప్ప కూలిందని.. కూలీలకు అండగా ఆదివారం విశాఖ సాగరతీరంలో వేలాది మందితో జనసేనుడు లాంగ్ మార్చ్ కు సిద్ధమయ్యాడు. ఇందుకు అవసరమైన జనసమీకరణ ఇతర ఏర్పాట్లు కూడా జనసేన అగ్రనేతలు నాదెండ్ల మనోహర్ నాగబాబులు పర్యవేక్షిస్తున్నారట. అయితే ఇసుక కొరతపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ చురకలంటించారు. 

శనివారం విశాఖపట్నం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఇసుక కొరత లేదని మేము ఎక్కడా చెప్పలేదని.. ఇసుక కృత్రిమ కొరత సృష్టించామని ప్రతిపక్షాలు మాట్లాడటం దారుణంగా ఉందన్నారు. వరదల సమయంలో ఇసుక తీయడం ఎంత కష్టమో ఐదు కోట్ల ప్రజలకు తెలుసునని వెల్లడించారు. పవన్‌ కల్యాణ్‌ లాంగ్ మార్చ్‌కి ఇసుక డాన్ అచ్చెన్నాయుడు టీడీపీ తరపున ముఖ్య అతిథిగా వస్తున్నారనడం ఆశ్చర్యం‌ ఉందన్నారు. 

మీరు లాంగ్ మార్చ్ చేసినా, పాకినా ప్రజలు విశ్వసించరన్నారు. 'మీది లాంగ్ మార్చ్ కాదని.. షార్ట్ మార్చేనని... మీకు లాంగ్ అనే పదం సూట్ కాదని' ఎద్దేవా చేశారు. చంద్రబాబు ట్రాప్‌లో పవన్ ఎందుకు పడిపోయారో అర్థం కావటం లేదంటు సూటిగా ప్రశ్నించారు. అక్రమ పోరాటాలను ప్రజలు విశ్వసించరన్నారు. ఏపీ ప్రజల మేలు కోసం వైఎస్ జగన్  ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నారన్నారు. భవన కార్మికులకి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, ఇసుక కొరత తాత్కాలికమేనని అమర్‌నాథ్‌ తెలిపారు. మరి దీనిపై జనసేనాని ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని జనసేనని పవన్ స్వయంగా టీడీపీ బీజేపీ కాంగ్రెస్ వామపక్ష పార్టీల నేతలకు ఫోన్ చేశారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీనికి మద్దతు తెలిపారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: