తెలంగాణ ఆర్టీసీ పైన కేసీయార్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ఆర్టీసీ కార్మికుల ఇంట్లో విషాదాలను నింపుతుంటే ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు పండగ చేసుకుంటున్నారు. నిన్న మొన్నటివరకు అద్దెబస్సులుగా పెళ్లిలకు, పేరంటాలకు తిరిగిన బస్సులు ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ అనే స్టిక్కర్లను అంటించుకుని దర్జాగా రోడ్లపైకి వస్తున్నాయి. రోడ్డుపైన ఆర్డీవో ఉంటే చాటుమాటుగా బస్సులు నడిపే డ్రైవర్లు ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా తమ బస్సులను పరిగెత్తిస్తున్నారు.


ఇకపోతే  ప్రైవేటు ట్రావల్స్ బస్సుల్లో ప్రయాణం ప్రాణాంతకం అన్న విషయం తెలిసిందే. కాని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సుఖము.. సురక్షితము అని ఇప్పటికి చాలా మంది ప్రయాణికులు విశ్వసిస్తారు. ఎందుకంటే ప్రైవేటు బస్సుల్లో ప్రయాణం చేయడం గాల్లో దీపం పెట్టడం ఒకటే అని భావిస్తారు. ప్రైవేటు బస్సు డ్రైవర్లు గంటకు కనీసం 100 కిలో మీటర్ల వేగంతో తమ బస్సులను పోటాపోటిగా నడిపిస్తారు. ప్రైవేటు బస్సుల సిబ్బంది నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల ఇప్పటికే వందల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.


అనేక మంది తల్లిదండ్రులకు గర్భ శోకాన్ని మిగుల్చాయి.  ఇలాంటి  ప్రమాదాల్లో కుటుంబ పెద్దలు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు దిక్కులేనివారైపోతున్నారు.. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న ప్రైవేట్ బస్సులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తుందనే వార్త తెలియడంతో  కిరాయిలకు వెళ్లే ట్రావెల్స్‌ బస్సులు  ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి.


ఆ బస్సులకు ఏకంగా ఆర్టీసీ అనే స్టిక్కర్లూ వచ్చేశాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెను ప్రైవేట్‌ వాహన యజమానులు అందిపుచ్చుకుని పల్లె వెలుగు.. ఎక్స్‌ప్రెస్‌లు అంటూ స్టిక్కర్లు అతికించుకుని మరీ నడుపుకుంటున్నారు. ఆదిలాబాద్‌ డిపోలో కనిపించిన ఈ దృశ్యాలే అందుకు నిదర్శనం. ఇక వీరి తీరుపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలంటున్నారు  ప్రయాణికులు..


మరింత సమాచారం తెలుసుకోండి: