అదో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. సమూల మార్పులు తెచ్చే ప్రాజెక్ట్. మౌళిక వసతుల్లో పెను మార్పులు తెచ్చే ఆ ప్రాజెక్ట్ పనులకు ఇప్పుడు అవినీతి మరక అంటుకుంటోంది. టెండర్లు పూర్తయి....ఒప్పందం చేసుకున్న పనులనూ రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు. 


ఏపీలో పట్టణాలు, నియోజవకర్గాలను కలుపుతూ నిర్మించే రోడ్ల అభివృద్దికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అధికారులు సుదీర్ఘ కసరత్తు, ప్రయత్నాలు తరువాత వందల కిలోమీటర్ల రోడ్లు నిర్మించే ఈ ప్రాజెక్ట్ కు రుణం పొందగలిగారు. ఏపీ రూరల్ రీ స్ట్రక్చరింగ్ ప్రాజెక్ట్ పేరిట మొదలు పెట్టిన ఈ ప్రాజెక్ట్ కు ఏషియన్ బ్యాంక్ రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. దీంతో అధికారులు 55 ప్యాకేజ్ ల కింద ..రెండు మూడు నియోజకవర్గాల రోడ్లను కలిపి టెండర్లు పిలిచారు. టెండర్లు దక్కించుకున్న కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కూడా చేసుకుంది. ఈ మేరకు కొందరు పనులు కూడా మొదలు పెట్టారు. అయితే పంచాయతీ రాజ్ శాఖలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పై అవినీతి నీడలు కమ్ముకుంటున్నాయి. టెండర్లు, అగ్రిమెంట్లు పూర్తయిన పనులను నిలిపివేసేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.  


వందల కోట్లకు చెందిన పనులు కావడంతో దీనిపై పంచాయతీ రాజ్ శాఖలోని పెద్దల కన్నుపడింది. నిబంధనల ప్రకారం ఆ టెండర్లు రద్దు చెయ్యడం సాధ్యం కాకపోవడంతో.....ఆ శాఖకు చెందిన ముఖ్య అధికారితో కొత్త పంచాయతీ మొదలు పెట్టారనే వాదన వినిపిస్తోంది. తాము సూచించిన వారి పేరున ఎస్క్ర్యూ అకౌంట్ తెరవాలని ఓ ఉన్నతాధికారి ఒత్తిడి చేస్తున్నారట. దీంతో ఆయా జిల్లాలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు.... జిల్లా మంత్రులు, ముఖ్య నాయకులను కలుసుకుని తమ గోడు వెల్లబోసుకున్నారట. ఓ జిల్లా మంత్రి స్వయంగా దీనిపై పంచాయతీ రాజ్ శాఖ పెద్దలతో మాట్టాడినట్లు తెలుస్తోంది. అయినప్పటకీ ఆ ఉన్నతాధికారి ఒత్తిళ్లు ఆగలేదని సమాచారం. ఒప్పందాలు జరిగిన సమయంలోనే తాము కొంత ఖర్చు పెట్టుకున్నామని...ఇప్పుడు కొత్తగా ఇబ్బందులు సృష్టిస్తే పనులు చెయ్యలేమని కాంట్రాక్టర్లు అంటున్నారు. 


వాస్తవంగా ఈ ప్రాజెక్ట్ అనుకున్నట్లు జరిగితే మండల, నియోజవకర్గ స్థాయిలో అనూహ్య మార్పులు వస్తాయి. మౌళిక సదుపాయాలు పెరిగి రూపు రేఖలు మారిపోతాయి. అయితే స్వయంగా ఏషియన్ బ్యాంక్ నిధులు ఇచ్చే ఇలాంటి ప్రాజెక్ట్ కు... ఇలా అవినీతి లెక్కలతో అడ్డుతగలడంపై పెద్ద చర్చే జరుగుతుంది. ఓ పక్క రివర్స్ టెండరింగ్ అని సీఎం నిధులు ఆదా చేస్తుంటే....పంచాయతీ రాజ్ శాఖలో ఉన్నతాధికారే అవినీతికి తెర లేపేలా ఒత్తిళ్లు తేవడంపై  శాఖలో విస్తృత చర్చ జరగుతుంది. పనులు రద్దు అయితే ప్రాజెక్ట్ కు ఆర్థిక కష్టాలు తప్పవని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. దాంతో ఎలాగైనా ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి...కొత్తగా మొదలైన అకౌంట్ వివాదానికి ముగింపు పలకాలని కాంట్రాక్టర్లు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: