దేశ రాజధానిలో పోలీసులు, లాయర్ల మధ్య గొడవ రణరంగాన్ని తలపించింది. పోలీస్ వ్యాన్‌ను ఓ న్యాయవాది కారు ఢీకొట్టడంతో తలెత్తిన వివాదం ...చిలికి చిలికి గాలివానగా మారింది. లాయర్‌ ను పోలీసులు కొట్టడం... పోలీసు వాహనాలకు న్యాయవాదులు నిప్పుపెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు, లాయర్లు గాయపడ్డారు. 


ఒకరు ప్రజలకు రక్షణగా నిలిచే రక్షకభటులు. మరొకరు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించే న్యాయవాదులు. శాంతిభద్రతలను కాపాడాల్సిన వీరు... వీధిన పడి పోట్లాడుకున్నారు. ఇరువర్గాల విధ్వంసంతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హస్తినలోని తీస్ హజారీ కోర్టు ఆవరణలో పోలీసులకు, లాయర్లకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, పలువురు లాయర్లు గాయపడ్డారు. వీరిలో ఒక పోలీస్‌ కమిషనర్‌ కూడా ఉన్నారు. 17 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక పోలీసు వాహనం మంటల్లో కాలిపోయింది. 


ఒక న్యాయవాది కారు అనుకోకుండా జైలు వ్యానుకు తగలడంతో మాటామాటా పెరిగింది. దాంతో ఆ లాయర్‌ను దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులు కొట్టారని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. న్యాయవాదిని విడిపించేందుకు కొందరు జడ్జిలు స్టేషన్‌ కు వెళ్లినప్పుడు... పోలీసులు నాలుగు రౌండ్ లు కాల్పులు జరిపారని లాయర్లు ఆరోపిస్తున్నారు. ఘటనకు కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ లాయర్లు కోర్టు గేటు వద్ద నిరసన తెలిపారు. ఇదే సమయంలో న్యాయవాదులు ఒక పోలీసు వాహనానికి నిప్పు పెట్టడంతోపాటు, మరో 17 ఇతర వాహనాలను ధ్వంసం చేశారు. తాము కాల్పులు జరిపామన్న లాయర్ల ఆరోపణను పోలీసు అధికారులు ఖండించారు. లాయర్లే తమపై దాడి చేసి గాయపర్చారని చెబుతున్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా రేపు ఢిల్లీలోని అన్ని జిల్లా కోర్టుల్లో విధులను బహిష్కరించనున్నట్లు న్యాయవాద సంఘాలు పేర్కొన్నాయి. చూడాలి మరి ఈ పరిస్థితులు ఎంతవరకు దారితీస్తాయో..!


మరింత సమాచారం తెలుసుకోండి: