ఏపీలో ఇసుక దుమారం రోజురోజుకూ రేగుతోంది. ఇసుక కొరతతో కార్మికులు పనులు లేక అలమటిస్తున్న వేళ...  ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా ఇసుకను దోచేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో ఇసుక సమస్య తలెత్తిందని ఆరోపిస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం కృత్రిమ కొరతేనని విపక్షాలకు కౌంటర్ ఇస్తోంది. 


ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే భవన నిర్మాణ కార్మికులు తిండిలేక అలమటిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.  ఐదు నెలలు ఏమీ పట్టించుకోకుండా ఇప్పుడు తీరిగ్గా ఇసుక వారోత్సవాలు నిర్వహించడమేంటని విమర్శించారు టీడీపీ నేతలు. తాపీ మేస్త్రీల నుంచి సిమెంట్ కంపెనీల వరకు ఎవరికీ పని లేకుండా చేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు. 


ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నా ప్రభుత్వం కట్టడి చెయ్యడం లేదని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇసుక సమస్యను పరిష్కరించలేని ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా ప్రగతి పథంలో నడిపించగలదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా ఇసుకను దోచేస్తున్నారని కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక దోపిడీని అడ్డుకున్న వారిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో  లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారని అన్నారు. 


మరోవైపు,  ప్రతిపక్షాల ఆరోపణలను అధికార పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇసుక విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. ఇసుక సమస్య ఉన్న మాట వాస్తవమేనని..దాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెబుతున్నారు. మరోవైపు.. ఇసుక విషయంలో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దోపిడీకి పాల్పడే వారిపై  చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. చెక్‌పోస్టుల వద్ద నిఘా పెట్టింది.  అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతోంది. ఇసుక కొరతకు గల కారణాలపై ప్రతిపక్షాలకు ఘాటైన సమాధానమిస్తూ.. ప్రజలకు వాస్తవాలు తెలిసేలా చేస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: