తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాలుస్తోంది. ఎక్కడికక్కడే ప్రజాప్రతినిధులను కార్మికులు అడ్డుకుంటున్నారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో హరీశ్ రావును... వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరులో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఆర్టీసీ కార్మికులు అడ్డుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 


తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రభావం ప్రజాప్రతినిధులపైనా పడింది. ఎమ్మెల్యేలు... మంత్రులు ఎక్కడికి వెళ్లినా ఆర్టీసీ కార్మికులు అడ్డుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో పర్యటించిన హరీష్ రావును ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.


వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుండెపోటుతో మృతి చెందిన ఆర్టీసీ కార్మికుడు రవీందర్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని అడ్డుకున్నారు కార్మికులు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. న్యాయమైన డిమాండ్ లు నెరవేర్చేంత వరకూ సమ్మె కొనసాగిస్తామని తెలిపారు ఆర్టీసీ కార్మికులు. 


ఆర్టీసీ కండక్టర్ రవీందర్ అంతిమయాత్రలో గందరగోళం చోటుచేసుకుంది. అంతిమయాత్రను త్వరగా ముగించాలని పోలీసులు  తొందరపెట్టారు. కుటుంబ సభ్యులు, అంతిమయాత్రలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఇంతలో  పోలీసు కమిషనర్‌ మధు ఆర్టీసీ కార్మికులపై చేయి చేసుకున్నారు. పోలీసుల తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు కార్మికులు. అంతిమయాత్రను ఆపి.. రవీందర్‌ మృతదేహంతో రోడ్డుపైనే బైఠాయించి కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. 


గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన ఆర్టీసీ కండక్టర్‌ రవీందర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచాడు. దీంతో పోలీసులు భారీ కాన్వాయ్‌తో రవీందర్‌ మృతదేహాన్ని ఆయన స్వస్థలం వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరుకు తరలించారు. రవీందర్‌కు భార్య రజిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవీందర్‌ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ ఆశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. మొత్తానికి... ఆర్టీసీ కార్మికుల నిరసనలు...ఆందోళనలతో తెలంగాణ రాష్ట్రం అట్టుడుకుతోంది. ప్రభుత్వం...కార్మికులు ఇరు వర్గాలు పట్టువీడకపోవటంతో సమ్మె మరింత ఉధృత రూపం దాలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: