భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రావాలంటూ ఆసియన్ - భారత్‌ సదస్సు వేదికగా పిలుపునిచ్చారు మోడీ. పరిశ్రామిక రంగం అభివృద్ధి కోసం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు భారత ప్రధాని. బ్యాంకాక్‌ పర్యటనలో భాగంగా పలు దేశాల ప్రతినిధులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. 


మూడు రోజుల పర్యటనలో భాగంగా థాయ్‌లాండ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ.. బ్యాంకాక్‌లో జరిగిన 16వ ఆసియాన్​-భారత్​సదస్సుకు హాజరయ్యారు. తీరప్రాంత రక్షణ సహా వ్యవసాయం, ఇంజినీరింగ్​, డిజిటల్​ సాంకేతికత, పరిశోధన రంగంలో పరస్పర సహకారాన్ని అందించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. పలు అంశాల్లో ఆసియాన్​ కూటమిలోని సభ్యదేశాలతో కలిసి సహకరించేందుకు భారత్​ సిద్ధంగా ఉందని తెలిపారు ప్రధాని. ఇండో-ఫసిఫిక్​ ప్రాంతానికి సంబంధించి పరస్పర సహకారంపై కూటమి దేశాలు, భారత్ ​ఏకాభిప్రాయంతో ఉండటాన్ని స్వాగతించారు మోడీ.


భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ఆసియన్ దేశాలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. భారత్‌లో సానుకూల మార్పులు వచ్చాయని చెప్పడానికి సంతోషిస్తున్నామన్నారు. వాణిజ్యానికి అనుకూలంగా మౌళిక వసతుల కల్పనతో పాటు.. పన్ను రేట్ల పునర్వ్యవస్థీకరణ భారత్‌లో పెట్టుబడులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. ఐదేళ్లలో జీడీపీ పెరిగేలా చేశామనీ.. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా అవతరించాలన్న భారత్‌ కల త్వరలోనే సాకారం అవుతుందన్నారు ప్రధాని. 


 
థాయ్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి జనరల్ ప్రయూత్​చాన్​ఓ చాన్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. మరోవైపు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో.. మయన్మార్ ​కౌన్సిలర్ ​అంగ్​సాన్​సూకీతోనూ ప్రధాని మోడీ సమావేశమయ్యారు. 


మొత్తానికి థాయ్ లాండ్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్న మోడీ.. అక్కడి నాయకులు, అధికారులతో మమేకమయ్యారు. అక్కడి సంస్కృతి సంప్రదాయాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆ దేశ వంటకాలను రుచి చూస్తూ.. మైమరిచిపోతున్నారు. వ్యాపారవేత్తలను ప్రసన్న చేసుకునే పనిలో బిజీ అయిపోయిన మోడీ.. భారతదేశంలో పెట్టుబడులకు గల అవకాశాలపై వివరిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: