పట్టపగలు ఒక మహిళా ఉద్యోగిని అత్యంత క్రూరంగా పెట్రోల్ పోసి..ఆఫీసులో హత్య చేయటం సంచ‌ల‌నం సృష్టించింది. హైద‌రాబాద్ అబ్ధుల్లాపూర్‌మెట్‌లో జ‌రిగిన ఈ అత్యంత దారుణ ఘ‌ట‌న తీరు ఉద్యోగుల వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది. తహశీల్దారు ఆఫీసులోకి మధ్యాహ్నం 1.20గంటలకు వ‌చ్చిన‌ హంతకుడు అరగంట పాటు ఆమె రూమ్‌లో ఉన్నాడు. ఆమెతో చ‌ర్చిస్తూనే...పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఏం జరుగుతోందో తెలీక విజయ ఆఫీసులో హాహాకారాలు పెట్టి ప‌రుగులు తీసిన‌ప్ప‌టికీ...ఆమె ప్రాణాలు ద‌క్క‌లేదు.


కాగా, హంతకుడిని గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్‌గా గుర్తించారు. భూ వివాదంలోనే ఇలా క్రూరంగా ప్ర‌వర్తించార‌ని తెలుస్తోంది. ఎమ్మార్వోను చంపేందుకు ప్ర‌య‌త్నించిన స‌మ‌యంలో....నిందితుడికి సైతం తీవ్ర గాయాలు అయిన‌ట్లు స‌మాచారం. కాగా, హ‌యత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ద‌ర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి విష‌యంలో....అధికారిక‌, స‌మ‌గ్ర స‌మాచారం రావాల్సి ఉంది. 


కాగా, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఘ‌ట‌న‌పై స్పందించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగుడ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న  స‌మ‌యంలో ఆమెకు విష‌యం తెలియ‌డంతో సంఘటన స్థలానికి బయల్దేరారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ...అబ్దుల్లాపూర్మెట్ ఎమ్మార్వోపై దాడిలో నిందితులు ఎవరైనా చట్టపరమైన కఠిన శిక్షలు అమలు చేయాలని అన్నారు. తమకు ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వచ్చే సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలి తప్ప అధికారులపై ఇలాంటి చర్యలు చేయడం దారుణమ‌ని పేర్కొన్నారు.

కాగా, ఉస్మానియా మార్చురీకి తహశీల్దార్ మృతదేహాన్ని తరలించారు.మ‌రోవైపు, దారుణ విషయం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.  ప్ర‌త్య‌క్ష సాక్షుల నుంఇచి ఆయ‌న స‌మాచారం అడిగి తెలుసుకున్నారు.కాగా, కార్యాల‌య సిబ్బంది తహశీల్దార్ ను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే విజయ శరీరం మొత్తం కాలిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్లలో ఒకరికి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: