తెలంగాణలో ఆర్టీసి సమ్మె 31రోజు కొనసాగుతోంది. సీఎం డెడ్ లైన్ బేఖాతర్ చేసిన కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేశారు. పలుచోట్ల నేతలను అడ్డుకోవడం, దిష్టిబొమ్మల దగ్ధానికి పూనుకోవడంతో కార్మికుల ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. 


ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆర్టీసి సమ్మె 31రోజు ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. జేఏసి పిలుపుతో డిపోల ముందు ఆర్టీసి కార్మికులు, ఇటు విపక్షాలు నిరహార దీక్షలకు దిగాయి. నిర్మల్ లో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసే యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పరిస్తితి కాస్త ఉద్రిక్తంగా మారింది. 


సూర్యాపేట జిల్లాలో కోదాడ బస్టాండ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 31వ రోజు సమ్మెలో పాల్గొన్న కార్మికులు.. తాత్కాలిక కండెక్టర్లను విధుల్లో పాల్గొన కుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదంతో పాటు తోపులాటలు జరిగాయి. పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు.   


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని  కొత్తగూడెంలోని ఆర్టీసీ డిపో ఎదుట వేకువ జామునే కార్మికులు, అఖిలపక్షం నాయకులు బస్సులు బయటకు రానివ్వకుండా ధర్నా చేశారు. కొత్తగా వచ్చిన ప్రైవేటు డ్రైవర్లను, కండక్టర్ లను విధులకు రావొద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు.. స్టేషన్ కు తరలించారు.   


ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ గద్వాల ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళన కొనసాగించారు.  చనిపోయినవారికి నివాళిగా మౌనం పాటించి.. ఎవరు విధుల్లోకి వెళ్లకూడదని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో బిక్షాటనతో తమ నిరసన కొనసాగించారు.   


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన జరిగింది. స్థానిక పాత బస్టాండ్ నుండి జగదాంబ సెంటర్, ఆం బజార్ మీదుగా కొత్త బస్టాండ్ చేరుకుంది. ఆర్టీసీ సమస్యలు పరిష్కరించేలా చూడాలని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్మికుల సమస్యను పరిష్కరించాల్సిన కేసీఆర్, డెడ్ లైన్ లు  పెడుతూ బెదిరింపులకు దిగుతున్నారని అఖిలపక్షం నేతలు విమర్శించారు.


ఖమ్మంలో బస్‌డిపో నుంచి బస్‌స్టాండ్‌ వరకు ర్యాలీ తీసిన ఆర్టీసీ కార్మికులు.. బస్‌ స్టాండ్‌ వద్ద ధర్నా నిర్వహించారు..సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారని విమర్శించారు.  తమ సమస్యలు పరిష్కరించకుండా డ్యూటీలో జాయిన్‌ అయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు కార్మికులు.

మరింత సమాచారం తెలుసుకోండి: