అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో పోలీసులు మిస్టరీని చేధించారు. గుప్త నిధుల ఆశతోనే హత్యలు చేశారని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


పోలీసులను నాలుగు రాష్ట్రాలు తిప్పించిన అనంతపురం హత్య కేసులో నిందితులు ఎట్టకేలకు చిక్కారు. భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తూ చివరగా ఓ వ్యక్తిపై అనుమానంతో విచారించినపుడు అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రొఫెషనల్ కిల్లర్లను తలపించేలా జరిగిన ఈ హత్యలు కేవలం చిల్లర దొంగలు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తం ఆరుగురు  ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.


కొర్తికోటలో పురాతన శివాలయం ఉంది. ఇది శిథిలావస్థకు చేరటంతో దాని స్థానంలో రిటైర్డ్ టీచర్ శివరామిరెడ్డి కొత్త ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. దీనికి ఆయన సోదరి కమలమ్మ, బెంగళూరు నివాసి సత్యలక్ష్మి సహకరించారు. అయితే జూలై14 అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలో నిద్రిస్తున్న ఈ ముగ్గురూ  అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు. 


శివరామిరెడ్డి, కమలమ్మ, సత్యలక్ష్మిల గొంతుకోసి బండరాళ్లతో కొట్టి చంపారు. చనిపోయిన వారి రక్తాన్ని శివుడి విగ్రహానికి అభిషేకం చేశారు. ఆలయం సమీపంలో ఉన్న పాముల పుట్టల్లో కూడా రక్తాన్ని పోశారు. ట్రిపుల్ మర్డర్ స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. గుప్తనిధుల కోసం వీరిని నరబలి ఇచ్చినట్లు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే మూడు నెలలకు పైగా ఇన్వేస్టిగేషన్ సాగినా.. ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు. మూడు రాష్ట్రాల్లో నిందితుల కోసం వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేశారు. చివరికి మిస్టరీని చేధించారు.


పని పాట లేకుండా ఆకతాయిగా తిరుగుతూ అప్పడప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేసే ఓ గ్యాంగ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు దాదాపుగా నిర్దారించారు. కుందర్పి, కొత్తచెరువు, ముదిగుబ్బ , పూతలుపట్టు ప్రాంతాలకు చెందిన యువకులు ఈ హత్యలు చేశారు. శివరామిరెడ్డి ఆలయ విశిష్టత గురించి అందరికీ చెబుతూ ఇక్కడ భారీగా గుప్త నిధులు ఉన్నాయని చెబుతుండేవారు. అదే విషయం ఈ ముఠాను ఆకర్షించింది. అదే ఇంతటి దారుణానికి దారి తీసింది. జులై 14న ఆలయానికి చేరుకుని అక్కడ పడుకున్న ముగ్గురి గొంతులు కోశారు. ఆ తర్వాత రక్తాన్ని ఆలయం అంతా చల్లారు. అయితే నిధులు ఎక్కడ ఉంటాయి.. ఎలా తవ్వాలన్న అయోమయానికి లోనయ్యారు. ఈ లోపు సమయం అయిపోవడంతో భయంతో వెనుదిరిగారు. ఎవరికీ అనుమానం రాకుండా తమ పనుల్లో మునిగిపోయారు. కానీ చివరికి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. నిందితులంతా పాతికేళ్లలోపు వారే అని  వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: