కేసీఆర్ పెట్టిన డెడ్‌లైన్ ఈ అర్ధరాత్రికి ముగుస్తున్నా... ఆర్టీసీ కార్మికులు మాత్రం విధుల్లో చేరేందుకు ససేమిరా అంటున్నారు.  ప్రభుత్వం చర్చలు జరపకుండా బెదిరింపులకు పాల్పడుతోందని ఆర్టీసీ జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ని డెడ్‌లైన్లు పెట్టినా సమ్మెమ మాత్రం కొనసాగుతుందని ప్రకటించారు. మరోవైపు 208 మంది వరకు విధుల్లో చేరినట్టు ప్రభుత్వం ప్రకటించింది.


ఆర్టీసీ సమ్మె విషయంలో అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్‌ను కార్మిక సంఘాల నేతలు పట్టించుకోలేదు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం డెడ్‌లైన్ లతో తాత్సారం చేస్తోందని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. 32వ రోజు కూడా సమ్మెను కొనసాగించారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. జేఏసీ నేతలు, రాజకీయ పార్టీలు, సెంట్రల్‌ ట్రేడ్‌ యూనియన్ లు, ప్రజా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం బెదిరింపు ధోరణిని వదిలి చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. 


కార్మికులు విధుల్లో చేరకపోతే ఆర్టీసీయే ఉండదంటూ కేసీఆర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని జేఏసీ నేతలు విమర్శించారు. ఆర్టీసీ చట్టంలో మార్పులు చేయడంలో కేంద్రం అనుమతి తప్పనిసరన్న విషయం తెలుసుకోవాలన్నారు. మరోవైపు ఇప్పటి వరకు 208 మంది ఉద్యోగులు విధుల్లో చేరినట్టు ప్రభుత్వం ప్రకటించింది.  అర్ధరాత్రి వరకు అవకాశం ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందంటోంది.


మొత్తానికి కార్మికుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా తయారైంది. ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పిన మాటలకు తలొగ్గాలో.. లేక ప్రభుత్వం డెడ్ లైన్ కు తలవంచాలో అర్థం కాక అయోమయంలోనే గడుపుతున్నారు. ఓ వైపు విధులకు హాజరుకాకపోవడంతో జీతాల్లేక కొంత ఆర్థికంగా కుంగిపోయారు. కొందరు మాత్రం డిపోలకు వెళ్లి డిపోలకు చేరుతున్నారు. మరికొందరు మాత్రం ఆర్టీసీ జేఏసీ నేతల పిలుపునకు కట్టుబడి సమ్మెలో కొనసాగుతున్నారు. సీఎం కేసీఆర్ ఈ అర్థరాత్రి వరకు డెడ్ లైన్ పెట్టడంతో కార్మికుల్లో కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: