ఎన్నికల సమయంలో ఇచ్చిన మ‌రో హామీని..వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి నిల‌బెట్టుకున్నారు.  తిరుమ‌ల పూర్వ ప్రధానార్చకులు ర‌మ‌ణ‌దీక్షితులు ఆలయం ప్రవేశం చేసేందుకు లైన్‌ క్లియర్ చేశారు. సీఎం ఆదేశాలు జారీ చేయడంతో టీటీడీ.. రమణ దీక్షితులుకు ఆలయ ప్రవేశం కల్పించింది. ఆగమ సలహామండలి సభ్యుడితో పాటు, శ్రీవారి కైంకర్యాలు నిర్వహించడానికి అనుమతిని ఇస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది.  రమణ దీక్షితులు ఇద్దరు కుమారులను గోవిందరాజు ఆలయం నుంచి శ్రీవారి ఆలయానికి బదిలీ చేశారు. ఈ మేరకు టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది.


స్వామి వారి అతి పురాతనమైన ఆభరణాలు విదేశాలకు తరలి వెళ్తున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేయడంతో పాటు ఆగమశాస్త్రానికి విరుద్ధంగా శ్రీవారి పోటును మూసివేసి, తవ్వకాలు జరిపారని విమర్శించిన విషయం తెలిసిందే. దీంతో గ‌తంలో ఉన్న జీఓలో చూపిస్తూ రిటైర్మెంటు నిర్ణయం తీసుకున్నారు.  గతంలో ఎన్టీఆర్‌ హయాంలో మిరాశీ వ్యవస్తను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయంపై అర్చకులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మీరాశీ ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలను మాత్రమే న్యాయస్థానం అప్పట్లో రద్దుచేసింది. వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేయలేదు. ప్రస్తుత టీటీడీ పాలకమండలి నిర్ణయాన్ని తాజాగా హైకోర్టు తీర్పు తప్పు పట్టింది. దీంతో దీక్షితులుకు లైన్ క్లియ‌ర్ అయింది. 


తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆయనపై సుప్రీంకోర్టులో వేసిన అప్పీల్ ను వెనక్కి తీసుకోవాలని సూచనప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. అప్పీల్ ను వెనక్కి తీసుకోవడంతో పాటు ఆయనను మళ్లీ ప్రధాన అర్చకుడిగా నియమించడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించడానికి తిరుమలకు రానున్నారు. ఈ సందర్భంగా రమణ దీక్షితుల పదవీ విరమణ వివాదంపై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: