దాదాపు 50,000.... 217. ఏంటీ అంకెలు అనుకుంటున్నారా?  మొద‌టిది...తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల సంఖ్య‌. ఇక రెండోది...సోమ‌వా అర్ధరాత్రి వరకు సీఎం కేసీఆర్ విధులలో చేరేందుకు గడువు విధించినా...ఉద్యోగాలు పోతాయ‌ని బెదిరించినా...217కు మించని సంఖ్యలో విధుల్లో చేరిన కార్మికుల సంఖ్య‌. ఇక అస‌లు ట్విస్టేంటంటే...చేరిన వాళ్ల‌లో దాదాపు సగం మంది వచ్చే నెలలో రెటైర్‌ అయ్యే వాళ్ళు  కాగా మిగతా సగం మంది బస్ భవన్ లో పనిచేసే వాళ్లేనట‌. దీంతో....స‌హ‌జంగానే...తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 


సమ్మెను వీడి బేషరతుగా ఉద్యోగాల్లో చేరాలని, వారి ఉద్యోగ భద్రత ప్రభుత్వం చూసుకుంటుందని మూడురోజుల క్రితం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చివరిసారిగా పిలుపు ఇచ్చారు. అయితే, సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు తిరిగి ఉద్యోగాల్లో చేరేందుకు ఇచ్చిన మూడు రోజుల గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. ది, సోమవారాల్లో 28మంది విధుల్లో చేరగా.. మంగళవారం వివిధ రీజియన్లలో 189 మంది చేరారు. దీంతో గడువు ముగిసే సమయానికి 217 మంది విధుల్లో చేరినట్టయింది. ఉమ్మడి జిల్లాలవారీగా చూసినప్పుడు ఆదిలాబాద్‌లో 14మంది, కరీంనగర్‌లో 22, నిజామాబాద్‌లో 6, నల్లగొండలో 19, ఖమ్మంలో 8, మహబూబ్‌నగర్‌లో 13, మెదక్‌లో 8మంది, వరంగల్‌లో ఐదుగురు మంగళవారం విధుల్లో చేరారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్ ఉద్యోగుల్లో సుమారు 80 మంది, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మరో 14 మంది .. మొత్తం 189 మంది మంగళవారం విధుల్లో చేరారు. 


కాగా, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి త‌మ వైఖ‌రిని మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వం నుంచి హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని ఇప్పటికైనా చర్చలతో పరిష్కారించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏదైనా సమస్య పరిష్కారానికి ఇబ్బంది ఉంటే కూర్చొని మాట్లాడుకుందామని చెప్పారు.  కాగా, ప్ర‌భుత్వం నేడు వెలువ‌రించే ప్ర‌క‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: