తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ రెడీ అవుతోంది. పట్టణ ప్రాంతాల్లో తమకు పట్టు ఉందని నిరూపించుకుంటామని కాషాయ నేతలు అంటున్నారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకుంటున్నామని చెబుతున్నారు. మరోవైపు మునిసిపల్ ఎన్నికల ఇంఛార్జ్ లకు లక్ష్మణ్ క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. 


తెలంగాణలో త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో 128 మునిసిపాలిటీలు, 13 మునిసిపల్ కార్పొరేషన్ లు ఉన్నాయి. ఇందులో 121 పురపాలికలకు, 10కార్పొరేషన్ లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలలో కలిపి 2వేల 900కి పైగా వార్డ్స్, మునిసిపల్ కార్పొరేషన్ లలో గ్రేటర్ మినహాయిస్తే 511 డివిజన్ లు ఉన్నాయి. ఎన్నికలు జరిగే అన్ని మునిసిపాలిటీలలోని ప్రతి వార్డ్ లో పోటీ చేయాలని బీజేపీ డిసైడ్ అయింది. 


హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ లను వదిలేసి మిగతా 15 పార్లమెంట్ లను ఒక్కో క్లస్టర్ గా ఏర్పాటు చేసి ఆ నియోజక పరిధిలో కి వచ్చే మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించింది పార్టీ. ప్రతీ మునిసిపాలిటీకి రాష్ట్ర స్థాయి నేత ఒకరిని ఇంఛార్జ్ గా నియమించింది. కొన్ని క్లస్టర్ ల పరిధిలో, కొన్ని మునిసిపాలిటీల్లో   ఇప్పటికే పార్టీ సమావేశాలు జరిగాయి. గాంధీ సంకల్ప యాత్రలు కూడా మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పురపాలికల్లో చేస్తున్నారు. 


రాష్ట్ర పదాధికారుల సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. అయితే అనుకున్నంత బాధ్యత యుతంగా ఇంఛార్జ్ లు పని చేయడం లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. రిజర్వేషన్ ల ప్రకారం అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో  బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు ఉందనీ... పంచాయతీ ఎన్నికల్లో ప్రభావం చూపక పోయినా.. పురపాలక ఎన్నికల్లో ప్రభావం చూపెడుతామని బీజేపీ నేతలు అంటున్నారు. 


2014 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 13 వందల 99 వార్డుల్లో బీజేపీ 122 వార్డుల్లో మాత్రమే విజయం సాధించింది. మునిసిపల్ డివిజన్ లలో గ్రేటర్ తో కలుపుకొని 408 డివిజన్లకు గాను 15 డివిజన్ లలో మాత్రమే గెలిచింది. నారాయణ పేట్, భువనగిరి, వేములవాడ, కామారెడ్డి లలో చెప్పుకోదగ్గ వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది. మరి త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఏ మేరకు ప్రభావం చూపుతోందో చూడాలి మరి... తెలంగాణ లో ప్రత్యమ్నాయం తామే అంటున్న బీజేపీకి ఈ ఎన్నికలు ఒక పరీక్షేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: