అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హ‌త్య ఉదంతం సంచ‌ల‌నం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో ఈ ప‌రిణామం రెవెన్యూ ఉద్యోగుల‌ను క‌ల‌వ‌రపాటుకు గురిచేస్తోంది. తహసీల్దార్‌ విజయారెడ్డి అంత్యక్రియలు రెవెన్యూ ఉద్యోగుల భావోద్వేగాల మధ్య ముగిసిన త‌రుణంలో..మ‌రో రెవెన్యూ ఉద్యోగికి ఇదే త‌ర‌హా బెదిరింపులు వ‌చ్చాయి. ఏకంగా ఆర్డీఓ స్థాయి అధికారిని ఇలా టార్గెట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. 


విజయారెడ్డి హత్యకు నిరసనగా మంగళ, బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విధులు బహిష్కరించి కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించిన రెవెన్యూ ఉద్యోగులు గురువారం కూడా తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగుల నిరసన సందర్భంగా కా మారెడ్డి జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరసన దీక్షలో తహసీల్దార్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లచ్చిరెడ్డి సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. `తహసీల్దార్‌ విజయారెడ్డికి పట్టిన గతే మీకూ పడుతుంది. జాగ్రత్తగా పని చేయండి' అంటూ అగంతకులు కామారెడ్డి ఆర్డీవోతో పాటు జిల్లాలోని ఓ తహసీల్దార్‌కు ఫోన్‌ చేసి హెచ్చరించినట్టు తెలిపారు.  


మ‌రోవైపు, రెవెన్యూ సంఘాల ప్ర‌తినిధులు కొత్త డిమాండ్‌ను తెర‌మీద‌కు తెస్తున్నారు. ఆఫీసుకు కొత్తవాళ్లు ఎవరొచ్చినా అనుమానంగా చూడాల్సి వస్తోందని, తహసీల్దార్‌‌ విజయారెడ్డి సజీవ దహనం తర్వాత తాము మరింత భయపడుతూ బతకాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్ట్‌‌ –బీలో చేర్చిన భూముల వివాదాలను పరిష్కరించే అధికారం తమ చేతుల్లో లేదని, అయినా రైతుల దృష్టిలో తామే విలన్లుగా మారడం తీవ్రంగా కలచివేస్తోందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేయలేమని, ఇప్పటికైనా భూ రికార్డుల నిర్వహణ బాధ్యతల నుంచి తమను తప్పించి జనరల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కు పరిమితం చేయాలని వారు కోరుతున్నారు. భూ రికార్డుల నిర్వహణను తమ పరిధిలో నుంచి తీసేయాలని రెవెన్యూ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామ‌ని పేర్కొంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: