తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి క్యాస్ట్‌ ఏంటి..? ఆమెది ఎస్సీ సామాజిక వర్గమేనా..? కాదా అనే అంశం రాజధానిలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం ఏకంగా రాష్ట్రపతి వరకు వెళ్లింది. ఈ విషయంపై విచారణ చేసి అసలు వాస్తవాలు వెల్లడించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు రాష్ట్రపతి.


తాడికొండ ఏపీ రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన నియోజక వర్గం. ఈ నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాల తర్వాత ఏది జరిగినా హాట్‌ టాపిక్‌ అవుతోంది. ఈ ఏడాది వినాయక చవితి రోజున జరిగిన వివాదం ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాల్లో విస్తృత చర్చకు దారి తీసింది. వినాయక పందిరి వద్ద స్ధానిక ఎమ్మెల్యే శ్రీదేవి పూజలు చేయడానికి వెళ్లారు. అప్పుడు ఆమెని స్థానిక టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది.


నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఆమె ఎస్సీ కాదంటూ టీడీపీ నేతలు అభ్యంతరాన్ని లేవనెత్తారు. ఈ విషయాన్నే లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం ద్వారా ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్రపతి విచారణకు ఆదేశించారు. ఎమ్మెల్యే శ్రీదేవి గతంలో చాలా ఇంటర్వ్యూల్లో తాను క్రిస్టియన్‌ను అని మాత్రమే చెప్పారు. అయితే ఎన్నికల నామినేషన్‌ పత్రాల్లో ఎస్సీ కేటగిరికి చెందిన మహిళగా నమోదు చేశారు శ్రీదేవి. కానీ ఆమె వివాహం ఓసీ వర్గానికి చెందిన వ్యక్తితో జరిగింది. ఓసీ వర్గానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమెకు ఎస్సీగా గుర్తింపు ఉండదన్న వాదన తెర మీదకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే డిఫెన్స్‌లో పడ్డారు. శ్రీదేవి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఆమెని వివాదాలు వరుసగా చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు ఆమె క్యాస్ట్‌ గురించి ఫైనల్‌ రిజల్ట్‌ ఎలా ఉండబోతుందన్నది సస్పెన్స్‌ నెలకొంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: