విశాఖలో వరకట్నం వేధింపులకు ఇద్దరు మహిళలను బలయ్యారు. అత్తారింటి వేధింపులకు నిండు జీవితాన్ని ముగించారు. స్టీల్ సిటీలో ఒకే రోజు జరిగిన రెండు ఘటనలు  సంచలనం కలిగించాయి. 


అందమైన జీవితం గురించిన కలలు కల్లలయ్యాయి. పెళ్లైన ఆరునెలలకే కట్నదాహం కబళించింది.  వరకట్న వేధింపులకు నిండు జీవితం ముగిసింది. పురుగు మందు తాగి ముంచంగిపుట్ట మండల వ్యవసాయ విస్తరణాధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యవసాయ పాలిటెక్నిక్ చదివిన దివ్యకు అనకాపల్లి గవరపాలేనికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బుద్ద చైతన్యతో గత మే 18న వివాహమైంది. వివాహ సమయంలో రూ. 4 లక్షల కట్నం, 12 తులాల బంగారం మరో లక్ష రూపాయలతో సారె కొనుగోలు చేసి అందజేశారు. పెళ్లి తర్వాత నెలరోజుల నుంచి అదనపు కట్నం తీసుకురావాలని దివ్యను భర్త, అత్త, ఇద్దరు ఆడపడుచులు వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు.


పదిరోజుల క్రితం ఆమెను భర్త చైతన్య తీవ్రంగా కొట్టి అమ్మగారింటికి పంపేశాడు. నాటి నుంచి మునగపాకలో పుట్టింట్లోనే ఉంటోంది. వేధింపులు తట్టుకోలేక శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పురుగు మందు తాగింది. ఇంటివద్దే ఉన్న తల్లి పూర్ణ గమనించి కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి వెంటనే వాహనంలో అనకాపల్లి వంద పడకల ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దివ్య మృతి చెందింది. తన చావుకు కారణాలను సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడింది దివ్య. కాళ్లపారాణి ఆరకముందే అల్లారు ముద్దుగా పెంచుకున్నకూతురు బలవన్మరణానికి పాల్పడటం తల్లిదండ్రులకు గుండెకోత పెట్టింది.


కూతురు మరణంపై మునగపాక పోలీస్ స్టేషన్ లో దివ్య తండ్రి పెంటకోట సన్యాసిరావు ఫిర్యాదు చేశారు. తమ బిడ్డ చావుకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రాధేయపడుతున్నారు. చనిపోయే ముందు దివ్య రెండు నోట్ లు రాసింది. తన పరిస్థితిని, బలవన్మరణానికి గల కారణాలను అన్నకు రాసిన లెటర్ లో ప్రస్తావించింది. ఇందులో భర్త, అత్త వేధింపులు భరించలేక పోయానని రాసింది. తల్లిదండ్రులు గొడవపడొద్దని సూచించింది. అమ్మ,నాన్నలను జాగ్రత్తగా చూసుకోమని సోదరుడిని కోరింది. చైతన్య మరో పెళ్ళి చేసుకోకుండా చూడాలని...మరో ఆడపిల్ల జీవితం అన్యాయం అవ్వకూడదని కోరింది.


విశాఖ నగరంలోనే మరో భర్త వేధింపులకు మరో మహిళ కూడా బలయింది. అంబేడ్కర్ అనే వ్యక్తి అదనంగా మరికొంత కట్నం, ద్విచక్ర వాహనం కావాలంటూ రోజూ భార్యతో గొడవపడేవాడు. రాత్రి భార్య భర్యల మధ్య గొడవ జరిగిన తర్వాత ఉదయానికి ఆమె ఉరేసుకుంది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: