అయోధ్యతీర్పుపై పాకిస్థాన్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. భారత అంతర్గత వ్యవహారంపై పాకిస్తాన్ జోక్యం అవసరం లేదని మండిపడింది. అంతకుముందు అయోధ్య తీర్పును పాక్ విదేశాంగ మంత్రి విమర్శించారు. 


అయోధ్య  తీర్పుపై పాకిస్థాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అయోధ్య తీర్పు పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమనీ ఇందులో  పాక్ జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. ఒక సివిల్ అంశంపై భారత సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై పాక్ స్పందించడాన్ని ఖండిస్తున్నాం. పాకిస్తాన్‌ ది అసమంజస వాదన. ఇది చట్టానికి సంబంధించింది. అన్ని వర్గాల విశ్వాసాలకు చట్టం సమానంగా గౌరవిస్తుంది.. విద్వేషాలు సృష్టించాలనే ఏకైక లక్ష్యంతో భారత అంతర్గత విషయాల్లో పాక్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామని విదేశాంగ శాఖ విమర్శించింది. 


అంతకుముందు ...కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవం జరుగుతున్న సమయంలోనే అయోధ్యపై భారత సుప్రీంకోర్టు తీర్పు సరికాదని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి అన్నారు. ఆనందకర సమయాన్ని గమనంలో పెట్టుకోకుండా శనివారమే ఈ తీర్పునివ్వడం విచారానికి గురి చేసిందన్నారు. భారత్ లోని ముస్లింలు ఇప్పటికే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారనీ, తాజా తీర్పుతో ఆ ఒత్తిడి మరింత పెరుగుతుందన్నారు. 


మరోవైపు అయోధ్య విషయంలో సుప్రీం వెలువరించిన తీర్పును అధికారులు పలు దేశాల దౌత్యవేత్తలకు వివరించారు. కేసు పూర్వాపరాలతో సహా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సారాంశాన్ని వారికి తెలియజేశారు. పూర్తిగా అంతర్గత విషయమైనప్పటికీ.. ఇతర దేశాలతో సమాచారం పంచుకున్నందుకు భారత విదేశాంగ శాఖపై రష్యా విదేశాంగ శాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. అయోధ్య విషయంలో కీలక తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రజానీకం అంతా ఊపిరిపీల్చుకుంది. అయోధ్య రాముడిదేననీ.. ముస్లింల ప్రార్థనా మందిరానికి ఐదెకరాల స్థలం కేటాయించాలని రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీం సూచించడంతో వివాదానికి తెరపడింది. అంతా సానుకూల వాతావరణమే ఉంది. అయితే పాక్ మధ్యలో జోక్యం చేసుకోవడంతో భారత్ అగ్గిమీదగుగ్గిలమయింది. 




మరింత సమాచారం తెలుసుకోండి: