పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నామని హడావిడి చేసిన వంశీ.. తర్వాత ఒక్కసారిగా సైలంట్ అయ్యారు. వంశీ వైసీపీలో చేరతారని ప్రచారం జరిగినా అలాంటి పరిస్థితులేమీ కనిపించడం లేదు. వంశీ ప్లాన్ ఏంటి?. ఆయన ఏం చేయబోతున్నారు?. 


తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా ఎక్కడుంది? వంశీ రాజీనామా లేఖను చంద్రబాబుకు మాత్రమే పంపారు. అది కూడా వాట్సప్‌లో పంపారు. అయితే ఇప్పటి వరకూ చంద్రబాబు ఆ రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపలేదు. పార్టీకి వల్లభనేని వంశీ చేసిన రాజీనామాను సైతం చంద్రబాబు ఆమోదించలేదు. దీంతో వంశీ రాజీనామా హైడ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది.


వంశీ టీడీపీలో కొనసాగరని అందరూ అంటున్నా.. ఆయన తర్వాతి అడుగు ఏంటనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రాజీనామా వ్యవహారం తర్వాత వంశీ వద్దకు ఎంపీ కేశినేని నానిని రాయబారానికి పంపినా వెనక్కు తగ్గలేదు. తాను పార్టీలో కొనసాగేది లేదని తెగేసి చెప్పడంతో వల్లభనేని వంశీ వ్యవహారాన్ని చంద్రబాబు పార్టీ సమావేశాల్లో ప్రస్తావిస్తున్నారు. అక్రమ కేసులతో వేధించడం వల్లనే  వంశీ పార్టీకి రాజీనామా చేశారని చెబుతున్నారు.


ఇటీవల చిత్తూరు జిల్లాలో జరిగిన నియోజకవర్గ సమీక్షలో సైతం వల్లభనేని వంశీ వ్యవహారాన్ని చంద్రబాబు హైలెట్ చేశారు. అయితే ఇంతకీ వల్లభనేని వంశీ పార్టీని వీడుతున్నట్లు చెప్పారు కానీ ఇంతవరకూ రాజీనామా లేఖను స్పీకర్ కు పంపలేదు. దీంతో ఆయన వల్లభనేని వంశీని రూల్స్ కమిటీలో సభ్యుడిగా నియమించారు. అసలు వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? లేదా? అన్నది కూడా అనుమానంగానే ఉంది.


కేవలం ప్రభుత్వాన్ని బెదిరించడానికే వల్లభనేని వంశీ రాజీనామా చేశారా? బెదిరింపులే అయితే వైసీపీ నేతలతో కలిసి సీఎం జగన్‌ను కలవాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలకు సమాధానం లేని పరిస్థితి. రాజకీయాల నుంచే వైదొలగుతానని ప్రకటించినా.. ఇప్పటికీ ఆయన గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. వంశీ చేరికపై వైసీపీ నుంచి కూడా స్పష్టమైన సంకేతాలు లేకపోవడంతో... రాజీనామాపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. టీడీపీకి రాజీనామా చేసి స్వతంత్ర సభ్యుడిగా కొనసాగాలని వంశీ భావిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: