ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని మార్పు అంశంపై గత కొన్ని రోజుల రగడ  కొనసాగుతూనే ఉంది. గత టిడిపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాజధాని నిర్మాణం సరిగ్గా  లేదని... రాజధాని నిర్మాణం మొత్తం తాత్కాలికంగా జరిగిందంటూ జగన్ సర్కార్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. రాజధాని అమరావతి మార్పు తథ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేసి  రాజధాని మార్పు విషయాన్ని తెరమీదికి తెచ్చారు. ఇక అప్పట్నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని రగడ కొనసాగుతూనే ఉంది. రాజధాని నిర్మాణం సరిగా జరగలేదని... గత ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నిర్మాణం పేరుతో కోట్లకి కోట్లు కూడగట్టుకున్నారని ఆరోపించారు. 

 

 

 

 ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు పై ఇప్పటికే ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పలుమార్లు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే అటు ప్రతిపక్షాలు మాత్రం రాజధాని మార్పు చేయటం  వల్ల ప్రజాధనం వృథా అవుతుందని ఆరోపిస్తున్నారు. రాజధాని మార్పు అనే అంశం హేయమైన చర్య అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స  సత్యనారాయణ మరోసారి రాజధాని మార్పు విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు కోసం కమిటీ వేశామని తెలిపిన బొత్స సత్యనారాయణ... కమిటీ నివేదిక ప్రకారం రాజధాని నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. 

 

 

 

 ప్రభుత్వం నియమించిన కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నదని  మంత్రి బొత్స తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి పథంలో నడపడమే తమ ప్రభుత్వం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం కోసం గత  టిడిపి ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ప్రాంతం   సరైనది కాదని అందుకే రాజధాని మార్పు కు సంకల్పించామని  మరోమారు బొత్స స్పష్టం చేశారు. అయితే రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామని బొత్స హామీ ఇచ్చారు. రాజధాని విషయమే కాకుండా రాష్ట్రంలో హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై కూడా కమిటీ నివేదిక అందజేస్తుందని బొత్స స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: