దొంగ నోట్ల చలామణికి గుంటూరు జిల్లా కేంద్రంగా మారుతోంది. అమాయకులైన రైతులనే లక్ష్యంగా చేసుకొని దొంగనోట్ల ముఠాలు రెచ్చిపోతున్నాయి. పంట విక్రయించినప్పుడు.. చెల్లించే సొమ్ములో దొంగనోట్లను పెట్టేసి రైతులకు అంటగడుతున్నారు. వీటిని మార్చుకునేందుకు వెళ్లే అమయాక రైతులు అడ్డంగా బుక్కవుతున్నారు. 


గుంటూరు జిల్లా పల్నాడులో ఇప్పుడు నకిలీ నోట్ల చలామణి హాట్‌ టాపిక్‌గా మారింది. వరుసగా బయటపడుతున్న దొంగనోట్లు... జిల్లా వాసుల్లో కొత్త భయాలను సృష్టిస్తున్నాయి. రెండు వేల రూపాయల నోటు కనిపిస్తే చాలు.. జనం అనుమానంగా చూడటం మొదలుపెడుతున్నారు.గుంటూరు జిల్లాలోని శావల్యాపురంలో వారం రోజుల కిందట రెండు వేల రూపాయల దొంగ నోట్లు బయటపడ్డాయి. సొసైటీలో కొందరు రైతులు డబ్బు చెల్లించగా... అందులోని ఉద్యోగులు.. నకిలీ నోట్లు ఉన్నాయని గుర్తించి రైతులకు తిరిగి ఇచ్చేశారు. దీంతో దొంగనోట్ల విషయం తొలిసారి బయటకు వచ్చింది. శావల్యాపురంలో రద్దీగా ఉండే పెట్రోల్ బంకులు, వైన్‌షాపుల్లో నకిలీ నోట్ల చలామణికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే... తాజాగా ఇలాంటిదే పల్నాడు ప్రాంతంలో మరో ఘటన వెలుగు చూసింది. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నకిలీ నోట్లు చలామణి చేసే వారు ఈజీగా తమ పని చేసుకుపోతున్నారు. 


బొల్లాపల్లి మండలం జయంతి రామాపురానికి చెందిన రైతు ఇటీవల పత్తిపంట విక్రయించాడు. పత్తి వ్యాపారులు ఇచ్చిన నగదులో కొన్ని 2 వేల రూపాయల నోట్లు ఉన్నాయి. వాటిలో ఒక 2 వేల నోటును తన కుమారుడికి ఇచ్చాడు. స్థానికంగా ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా 2 వేల నోటు నకిలీదని తాము తీసుకోబోమని బంక్ సిబ్బంది సమాధానం ఇచ్చారు. వారం రోజుల వ్యవధిలోనే ఇది రెండో ఘటన కావటం పల్నాడు ప్రాంతంలో కలకలం రేపుతోంది. రెండు ఘటనల్లో కూడా రైతులే బాధితులు కావటం కలవరపెడుతోంది. పల్నాడు ప్రాంతంలో రాజకీయపరమైన గొడవలతో పాటుగా ఇప్పుడు దొంగ నోట్ల అంశం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు దొంగనోట్ల ముఠాలపై నిఘా పెట్టి అమాయకులు వీరి బారిన పడకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: