మహారాష్ట్ర గవర్నర్ కోషియారీ వ్యవహార శైలి చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానం మొదలైంది.  మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి సుమారు 20 రోజులవుతున్నా ఇంతవరకూ ఏ పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిన విషయం తెలిసిందే. ఒక విధంగా మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదిరిపోయినట్లే అనుకోవాలి.

 

అయితే సంక్షోభ నివారణకు గవర్నర్ కోషియారి అనుసరించిన మార్గమే ఇపుడు చర్చనీయాంశమైంది. మొదటగా 105 సీట్లొచ్చిన బిజెపిని ప్రభుత్వం ఏర్పాటుకు పిలిస్తే కమలంపార్టీ ఫెయిలయ్యింది. తర్వాత 56 సీట్లు వచ్చిన శివసేనను ఆహ్వానించారు. ఈ పార్టీ కూడా విఫలమైంది. ఇంత వరకూ గవర్నర్ అనుసరించిన విధానం బాగానే ఉంది.

 

అయితే మూడో పార్టీగా ఎన్సీపిని గవర్నర్ పిలిచారు. మంగళవారం రాత్రి 8.30 గంటల వరకు ప్రభుత్వం ఏర్పాటుకు గడువిచ్చారు. అయితే విచిత్రమేమిటంటే 8.30 గంటల వరకు వెయిట్ చేయకుండా అంతకు ముందే రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసు చేసేశారు.  8.30 గంటల వరకు వెయిట్ చేసి ఎన్సీపీ కూడా చేతెలెత్తేస్తే అప్పుడు రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయటంలో తప్పేమీ లేదు.

 

కానీ గడువిచ్చిన తర్వాత గడువు తీరేంత వరకు గవర్నర్ వేచి ఉండాలి కదా ? ఎందుకు వెయిట్ చేయలేదు ? అన్న ప్రశ్నకు గవర్నర్ నుండి సమాధానం రావటం లేదు. అంటే తెరవెనుక జరిగిన ఏదో పరిణామమే గవర్నర్ ను తొందరపెట్టుండాలి. ఆ ఒత్తిడి మేరకు రాష్ట్రపతి పాలనకు సిఫారసుచేసేశారు. ఇక్కడే గవర్నర్ చేసిన తప్పు బయటపడిపోయింది.

 

 ఈ పాయింట్ మీదే శివసేన గవర్నర్ సిఫారసును సవాలు చేస్తు సుప్రింకోర్టును ఆశ్రయించింది. గడువిచ్చిన తర్వాత గడువు ముగిసేవరకు వెయిట్ చేయకుండానే ఎందుకు రాష్ట్రపతి పాలన సిఫారసు చేయాల్సొచ్చిందనే ప్రశ్నకు సుప్రింకోర్టులో గవర్నర్ ఏమని సమాధానం చెబుతారో చూడాల్సిందే. సరే తమకు అవకాశం ఇవ్వలేదని కాంగ్రెస్ కూడా గోలపెడుతోందనుకోండి అది వేరే సంగతి. మొదటి ముగ్గురు ప్రభుత్వం ఏర్పాటు చేయలేనపుడు నాలుగోస్ధానంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయగలుగుతుంది ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: