ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ మేధావి. ఉన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పగలడు. విషయపరిజ్ఞానం ఉన్న రాజకీయ వేత్త. అయితే ఇప్పుడు ఉండవల్లి .. ఏపీ సీఎం జగన్ కు భహిరంగ లేఖ రాసినారు. ఏపీ విభజన చాలా అన్యాయం జరిగిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఏపీ విభజనపై చర్చను చేపట్టాలని లోక్ సభ స్పీకర్ కు నోటీసు ఇవ్వాల్సిందిగా వైసిపి ఎంపీలకు సూచించాలని ఆయన తన లేఖ ద్వారా కోరారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ఆ అన్యాయం గురించి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కూడా గతంలో పార్లమెంట్ వేదికగా ప్రస్తావించారని ఉండవల్లి అరుణ్ కుమార్ తన లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.


శీతాకాల సమావేశాల్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని ఉండవల్లి డిమాండ్ చేస్తున్నారు. 18 నుండి జరగనున్న శీతాకాల సమావేశాల్లో కచ్చితంగా ఏపీ విభజన అంశం ప్రస్తావనకు తీసుకు వచ్చేలా వైసిపి ఎంపీలు నోటీసులు ఇవ్వాలని ఆయన సూచించారు. ఏ పార్లమెంట్లో ఇంత హడావుడిగా ఏపీ విభజన జరిగిందో ఆ పార్లమెంట్లో ఇప్పటివరకు ఏపీ విభజనపై చర్చ జరగలేదని, ఈ సారైన చర్చ జరిగేలా వైసిపి పట్టుబట్టాలని ఆయన తన లేఖ ద్వారా సీఎం జగన్ కు తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 


ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంతకు ముందు కూడా టీడీపీ హయాంలో చంద్రబాబుకు ఇదే మాదిరిగా లేఖను రాశారు. కానీ అప్పట్లో చంద్రబాబు సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు మళ్ళీ ఉండవల్లి జగన్ ను లేఖ రాయటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఏపీకి ఇచ్చిన హామీలు నేటికి నెరవేరక పోవడంతో, ఏపీ అప్పుల రాష్ట్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పార్లమెంటులో ఏపీ విభజనపై చర్చ జరిగితే బావుంటుంది అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరి సీఎం జగన్ ఉండవల్లి రాసిన లేఖపై స్పందిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: