తెలుగుదేశంపార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే చంద్రబాబునాయుడుపై తిరుగుబాటు మొదలైనట్లే అనిపిస్తోంది.  తాజాగా గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ మీడియా సమావేశంలో చంద్రబాబు, లోకేష్ పై చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. దాదాపు 40 నిముషాల పాటు మాట్లాడిన వంశీ అబ్బా, కొడుకులను పాయింట్ బై పాయింట్ ప్రస్తావించి ఉతికి ఆరేశారు.

 

స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం అంశంతో మొదలుపెట్టి ఇసుక సమస్య, మొన్నటి ఎన్నికల్లో  పార్టీ ఓడిపోవటానికి కారణాలు, జనాలకు పార్టీ దూరమైపోవటం లాంటి అనేక అంశాలను వంశీ ప్రస్తావించారు. స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టటంపై జగన్మోహన్ రెడ్డికి తన మద్దతు ప్రకటించారు. వర్షాలు, వరదల సమయంలో ఇసుకను తవ్వితీసే టెక్నాలజీ ఉంటే చంద్రబాబే చెప్పాలని ఎద్దేవా చేశారు.

 

ప్రభుత్వానికి పురిటి వాసన కూడా పోక ముందే వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయటాన్ని తప్పుపట్టారు. టిడిపి ఎంఎల్ఏగా ఉంటూనే వైసిపి ప్రభుత్వం చేసే మంచిపనులకు మద్దతు పలకాలని డిసైడ్ అయినట్లు ప్రకటించటం సంచలనంగా మారింది. జూనియర్ ఎన్టీయార్ ను పార్టీకి దూరంగా పెట్టటం, తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా పోరాటం చేయకపోవటం లాంటి అనేక తప్పులను ఎత్తి చూపారు.

 

టిడిపిలో ఉంటూ వైసిపి ప్రభుత్వానికి మద్దతు పలకటమంటేనే చంద్రబాబు మీద తిరుగుబాటు  చేస్తున్నట్లే అర్ధమైపోతోంది. నిజానికి వంశీ లేవనెత్తిన చాలా అంశాలపై పార్టీలో చర్చ జరుగుతున్నదే. అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి ప్రభుత్వంపై ఆందోళనలు, నిరసనలంటే జనాలు ఒప్పుకోరని కొందరు సీనియర్ నేతలు చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదు. అందుకే ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలమైనట్లు స్పష్టంగా వంశీ చెప్పేశారు. గోదావరిలో బోటు ముణిగిపోయినట్లే పార్టీ కూడా ముణిగిపోవటం ఖాయమన్నారు.

 

వాస్తవం ఏమిటంటే జగన్ ను సిఎంగా చంద్రబాబుతో పాటు ఎల్లోమీడియా అంగీకరించలేకపోతోంది. అందుకనే జగన్ కు 151 సీట్ల మెజారిటి ఇచ్చిన జనాలను పదే పదే తప్పుపట్టటానికి కూడా వెనకాడటం లేదు. వంశీ చంద్రబాబుపై తిరుగుబాటు జెండా ఎగరేయటానికి ముందే తెలుగుయువత అధ్యక్షుడు దేవినని అవినాష్ వైసిపిలో చేరారు. ఇక మరో రెండు మూడు రోజుల్లో గంటా ఆధ్వర్యంలో కొందరు ఎంఎల్ఏలు టిడిపికి రాజీనామా చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంతో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: