చంద్రబాబునాయుడు, పుత్రరత్నం నారా లోకేష్ కు వల్లభనేని వంశీ గట్టి సవాల్ విసిరారు. దమ్ముంటే గన్నవరం నియోజకవర్గంలో తనపై పోటి చేసి గెలవాలని సవాలు విసిరారు. పార్టీ సింబల్ పై పోటి చేయటం వల్లే తాను మొన్నటి ఎన్నికల్లో గెలిచానని కొందరు టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమన్నారు. పార్టీ సింబల్ తో మొన్నటి ఎన్నికల్లో ఎంతమంది పోటి చేస్తే ఎంతమంది గెలిచారంటూ వంశీ ఎదురు ప్రశ్నించటంతో చాలామంది నేతల నోళ్ళు మళ్ళీ లేవలేదు.

 

చంద్రబాబు సంతకంతో బిఫారం అందుకున్న 175 మంది పోటి చేస్తే గెలిచింది 23 మాత్రమే అన్న విషయం అందరికీ తెలుసన్నారు. స్వయంగా కొడుకు లోకేష్ మంగళగిరిలో  ఎందుకు ఓడిపోయారు ? అంటూ నిలదీశారు.  రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో కొడుకునే గెలిపించుకోలేకపోయిన చంద్రబాబు గన్నవరంలో నన్ను గెలిపించటమేంటి ? అంటూ ఎద్దేవా చేశారు.

 

నిజానికి వంశీ అడిగిన ప్రశ్న చాలామంది మదిలో మెదులుతున్నదే. కాకపోతే బహిరంగంగా చంద్రబాబునో లేకపోతే లోకేష్ నో అడిగే ధైర్యం లేకపోవటంతో ఎవరికి వారుగా మౌనంగా ఉండిపోతున్నారు. అందుకనే వంశీ ప్రశ్నలకు టిడిపి నుండి మళ్ళీ సమాధానాలు రావటం లేదు. ఎందుకంటే టిడిపి నేతలు అడుగుతున్న ప్రశ్నలేమో ఎన్టీయార్ ట్రస్టు భవన్ లో రెడీ అయి అందరికీ చేరుతున్నాయి. కాబట్టి తమకు అందిన స్క్రిప్ట్ ను చదివి వినిపిస్తున్నారు. మరి వంశీ అడిగిన ప్రశ్నలకు నేతల దగ్గర సమాధానాలు లేవు కాబట్టి రిప్లై ఉండటం లేదు.

 

పైగా వంశీ గురించి మాట్లాడటానికి కూడా చాలామంది నేతలు ఇష్టపడటం లేదు. పార్టీ గుట్టుమట్లన్నీ వంశీకి బాగా తెలిసినవే. దాంతో నేతల్లో వ్యక్తిగతాలు కూడా వంశీకి పూర్తిగా తెలుసు. దాంతో తాము వంశీ గురించి మాట్లాడినపుడు ఎదురు తమ గురించి మాట్లాడితే సమాధానం చెప్పుకోలేమన్న భయమే అందుకు కారణం. మరి ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో చూడాల్సిందే.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: