పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఈనెల 18వతేదీ నుంచి జరగనున్న నేపధ్యంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ముఖ్యమంత్రి జగన్‌ ప్రస్తావిస్తూ అవినీతి రహిత పాలన, పథకాల అమలులో వివక్షకు తావు లేకుండా తమ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తున్నా నిరంతరం తమపై టీడీపీ బురద జల్లుతూ దుష్ప్రచారం చేస్తోందని, దీన్ని బలంగా తిప్పి కొట్టాలని ఇందుకుగాను  రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం పార్లమెంట్‌లో గట్టిగా పోరాడాలని, జగన్ పేర్కొన్నారు.


అంతే కాకుండా విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వెనుకబడిన జిల్లాలకు రూ.7,530 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేంద్రం రూ.1,050 కోట్లు ఇచ్చిందని మిగిలిన నిధుల విడుదలకు గట్టిగా ప్రయత్నించాలని సీఎం సూచించారు. ఇకపోతే ఉపాధి హామీ కింద రూ.2,246 కోట్ల నిధులు రావలసి ఉందని, పీఎంజీఎస్‌వై కింద రోడ్ల నిర్మాణ దూరాన్ని 3,285 నుంచి 6,135 కిలోమీటర్లకు పెంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేసిన విజ్ఞప్తిని పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తావించాలన్నారు.


ఇదేకాకుండా ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన మాదిరిగానే ఏపీకి కూడా 7 కొత్త మెడికల్‌ కళాశాలలను మంజూరు చేయాల్సిందిగా కోరాలని, గోదావరి, కృష్ణా అనుసంధానాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించేలా, గ్రామీణ ప్రాంతాలకు 12 లక్షల ఇళ్లు కేటాయించి లబ్ధిదారుల ఎంపిక అర్హతలను సడలించేలా చూడాలని, ఇలా ఇప్పటివరకు విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నింటినీ నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.


ఇదే కాకుండా వైఎస్సార్‌ సీపీ పార్టీ లోక్‌సభలో నాలుగో పెద్ద  పార్టీ అని గుర్తు చేస్తూ మన బలాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగించాలని ఎంపీలను కోరారు. ఇక ఈనెల 18వతేదీ నుంచి జరగనున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఈ విధంగా ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: