అసెంబ్లీలో మూడో వర్గం అంటే ఏదేదో ఊహించేసుకోకండి. ఇపుడున్నవి రెండే వర్గాలు. మొదటిది అధికారపార్టీ వర్గం. రెండోది ప్రధాన ప్రతిపక్షం. అంటే టిడిపి వర్గమన్నమాట. తొందరలోనే  స్వతంత్ర ఎంఎల్ఏల పేరుతో మూడోవర్గం ఏర్పాటుకు రంగం రెడీ అవుతోందని సమాచారం. ఈ మూడోవర్గం ఏర్పాటుకు స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఇచ్చిన ప్రకటనే ఆధారం.

 

స్పీకర్ వల్లభనేని వంశీ వివాదంపై  మాట్లాడుతు వంశీని అసెంబ్లీలో స్వతంత్ర ఎంఎల్ఏగా పరిగణిస్తామని చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఎందుకంటే ఒకపార్టీ తరపున గెలిచిన ఎంఎల్ఏని స్వతంత్ర ఎంఎల్ఏగా పరిగణించే అవకాశమే లేదు. వంశీపై అనర్హత వేటుకు టిడిపి నుండి లేఖ అందితే  ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వంశీపై అనర్హత వేటు పడాల్సిందే.

 

కానీ వంశీ విషయంలో  అసెంబ్లీ స్పీకర్ చేసిన తాజా ప్రకటనతో అందరిలోను అయోమయం మొదలైంది. తన ప్రకటన ప్రకారమే స్పీకర్ గనుక నడుచుకునేట్లయితే తొందరలోనే చాలామంది స్వతంత్ర ఎంఎల్ఏలుగా కొనసాగేందుకు రెడీ అయిపోతున్నట్లు సమాచారం. ఎందుకంటే చంద్రబాబు మీద తిరుగుబాటు చేసి సస్పెండ్ అయ్యింది వంశీ మాత్రమే.

 

కానీ టిడిపిలో కంటిన్యు అవటానికి చాలామంది ఎంఎల్ఏలు సిద్ధంగా లేరనే ప్రచారం అందరికీ తెలిసిందే.  తక్కువలో తక్కువ ఓ 13 మంది ఎంఎల్ఏలు టిడిపిలో నుండి బయటకు వచ్చేయటానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మొన్న స్వయంగా చంద్రబాబే దీక్ష చేసినా ఉన్న 23 మంది ఎంఎల్ఏల్లో 13 మంది అడ్రస్సే  కనబడలేదు.  

 

అందరికీ ఫోన్ చేసి మరుసటిరోజు సమావేశానికి రావాలని చెబితే కూడా రాలేదు. వీరిలో అత్యధికులు బిజెపిలోకి దూకేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇన్ని రోజులు పార్టీ మారితే తమ సభ్యత్వాలు ఎక్కడ పోతాయో అని చాలామంది భయపడుతున్నారు. స్పీకర్ ప్రకటనతో ఇటువంటి వాళ్ళందరికీ ధైర్యం వచ్చినట్లైంది.

 

అందుకనే  పార్టీకి రాజీనామా చేయటం తర్వాత చంద్రబాబు,చినబాబును అమ్మనాబూతులు తిట్టి సస్పెన్షన్ వేటు వేయించుకుంటే చాలు. ఎంచక్కా అసెంబ్లీలో స్వతంత్ర ఎంఎల్ఏలుగా కంటిన్యు అయిపోవచ్చు. అంటే అధికార, ప్రతిపక్షాలు కాకుండా మూడో వర్గం ఎంఎల్ఏలు తయారైనట్లే కదా ? ఏమంటారు ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: