మహారాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్ త్రిల్లర్ మూవీని తలపిస్తున్నాయి. రోజుకొక ట్విస్ట్ తో అసలు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యపడుతుందా అనే సందేహాలు వస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ - శివసేన - ఎన్సీపీ కలిసి ముందుకు వస్తున్నాయని - ఈ మూడు పార్టీల మధ్య కనీస ఉమ్మడి కార్యక్రమం కోసం చర్చలు జరిగాయని శివసేన సీనియర్ నాయకులు సంజర్ రౌత్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ - ఎన్సీపీ - శివసేన మధ్య కుదిరిన ఫార్ములాను మూడు పార్టీలు కలిసి వెల్లడిస్తాయని  సంజయ్ రౌత్ అన్నారు. అయితే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. ``బీజేపీ- శివసేన కలిసి పోటీ చేశాయి. ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. అలాంటప్పుడు వారి రాజకీయాలు వారు చేస్తారు.. మా రాజకీయాలు మేము చేస్తాము’ అని శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.



దీనితో మూడు పార్టీల మధ్య సరైన ఒప్పందం జరగలేదని తెలుస్తుంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక ప్రెసిడెంట్ సోనియా గాంధీతో సాయంత్రం 4 గంటలకు శరద్ పవార్ భేటీ కానున్న సంగతి తెలిసిందే. సోనియాతో భేటీ నేపథ్యంలో శరద్ పవార్ ఇవాళ ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. సోనియాతో పవార్ ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు. సోనియా గాంధీతో సమావేశానికి ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ-శివసేన - కాంగ్రెస్-ఎన్ సీపీ ఎవరి రాజకీయాలు వారివని పవార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


అయితే ప్రభుత్వ ఏర్పాటు పై శివసేన చేస్తున్న వ్యాఖ్యలను పవార్ ఖండించారు. ప్రభుత్వ ఏర్పాటు పై ఎన్సీపీతో చర్చిస్తున్నట్లు శివసేన చెబుతోంది కదా’ అని మీడియా ప్రశ్నించగా... ‘అవునా?’ అంటూ తనకేమీ తెలియదని...అసలు ఆ ప్రక్రియ లేదన్నట్లు జవాబు ఇచ్చారు.ఇదిలాఉండగా శివసేన మాత్రం తమదే ప్రభుత్వమని ఢంకా భజాయించి మరీ చెప్తోంది. మహారాష్ట్రలో ఈ నెలాఖరులోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని - అసెంబ్లీలో తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తు అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెగదెంపులైన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం కాంగ్రెస్ - ఎన్సీపీ మద్దతు కోరుతున్నట్లు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: