తెలంగాణ‌లో హోరాహోరీగా జ‌రుగుతున్న ఆర్టీసీ స‌మ్మెలో అధికార‌-ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్న సంగ‌తి తెలిసిందే. ఆర్టీసీ కార్మికులు, ప్ర‌తిప‌క్షాలు ఓ వైపు ఉండ‌గా...అధికార ప‌క్షం మ‌రోవైపు ఉంది. తాజాగా ఈ ప‌ర్వంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఆర్టీసీ తాత్కాలిక ఎండీ సునీల్‌శర్మపై విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలైన కాంగ్రెస్‌, బీజేపీ ఆయ‌న తీరును తీవ్రంగా త‌ప్పుప‌డుతున్నాయి. పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కె.ల‌క్ష్మ‌ణ్ తాజాగా సునీల్ శ‌ర్మ‌పై విరుచుకుప‌డ్డాయి.

 

ఆర్టీసీ కార్మికులు, ప్రతిపక్షాలు కలిసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నట్టు హైకోర్టుకు సునీల్ శ‌ర్మ‌ అఫిడవిట్‌ సమర్పించడం పట్ల పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రచేయ లేదనీ, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రధాన ప్రతిపక్షంగా తాము ఎలాంటి ఆలోచనా చేయలేదన్నారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో హైకోర్టులో అన్ని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలు సరైనవి కాదనీ, వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 

 

సునిల్‌ శర్మపై  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తప్పుడు సమాచారంతో కూడిన నివేదికలు అందజేస్తూ కోర్టును తప్పుడుదోవ పట్టిస్తున్నారని, ఒక ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఇంతలా దిగజారడం దేశంలో తానెక్కడా చూడలేదన్నారు. అఫిడవిట్‌లో సునిల్‌శర్మ పేర్కొన్న వ్యాఖ్యలను హైకోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ జరపాలని కోరారు. సునిల్‌ శర్మ ఐఏఎస్‌ ఆఫీసరో? టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శినో? చెప్పాలని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు, యూనియన్లు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదో యాలని చూస్తున్నాయని ఒక ప్రభుత్వాధికారి ఓ పార్టీకి ఎలా వత్తాసు పలుకుతారని  ప్రశ్నించారు.రెండు ప్ర‌ధాన పార్టీలు చేసిన ఈ ఆరోప‌ణ‌ల‌పై సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి అయిన సునీల్ శ‌ర్మ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: