ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఎన్.సి.పి అధినేత శరద్ పవార్ భేటీ కావడం దేశ రాజకీయాల్లో ఉత్కంఠ రేపింది. మహారాష్ట్రలో అధికారం కోసం జరుగుతున్న పోరులో.. మోడీ-శరద్ పవార్ భేటీ ప్రాధాన్యత ఏర్పడింది. అయితే తమ భేటీలో రాజకీయాలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని శరద్ పవార్ చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు స్పష్టం చేశారు. అందులో భాగంగా రైతుల ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ మోడీకి ఓ వినతి పత్రం అందించినట్టు చెప్పారు. రైతులకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలనీ.. ఎలాంటి షరతులు లేకుండా వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని లేఖలో ప్రస్తావించారు. మరోవైపు మహారాష్ట్ర రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీ హోంమంత్రి అమిత్ షాతో పాటు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ పాల్గొన్నారు. 


మరోవైపు ఎన్.సి.పి ప్రయత్నాల్లో భాగంగా శరద్ పవార్ ఇప్పటికే న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమ్యారు. కనీస ఉమ్మడి  ప్రణాళికపై ఉభయులూ చర్చించారు. ప్రభుత్వ  ఏర్పాటు విషయంలో శివసేనతో సంప్రదింపులకు ముందు కామన్ మినిమం ప్రోగ్రామ్‌కు తుదిరూపు తీసుకురావాలని ఎన్‌సీపీ-కాంగ్రెస్ వ్యూహంగా  తెలుస్తోంది. సోనియాగాంధీ సైతం కర్ణాటకలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి కుమ్మలాటలతో ప్రభుత్వం చేజార్చుకున్న తరహాలో కాకుండా మహారాష్ట్ర  విషయంలో నేతలు నిబద్ధతతో వ్యవహరించాలనీ.. సొంత పార్టీ నేతలకు సోనియా గాంధీ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.

 

మరోవైపు...మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ-శివసేన మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై ఇరు పార్టీలను ఉద్దేశించి ఆర్ఎస్‌ఎస్‌ చీఫ్‌  మోహన్‌ భగవత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలం కలిసి కొనసాగిన ఆ రెండు పార్టీలు ఏ అంశంపై గొడవకు దిగినా రెండింటికీ నష్టమేనని వాటి పేర్లు  ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ''స్వార్థం అనేది మంచిది కాదని అందరికీ తెలుసు అని  అన్నారు. ఐతే...అతి కొద్ది మంది మాత్రమే నిస్వార్థంగా ఉంటారని చెప్పుకొచ్చారు. ఒకే విషయమై వారివురు గొడవపడినట్లయితే ఇద్దరూ ఓటమి చెందాల్సి  ఉటుంది'' అని పరోక్షంగా బీజేపీ-శివసేనను ఉద్దేశించి కామెంట్ చేశారు మోహన్ భగవత్.  

 

ఇక...మహారాష్ట్రలో సీఎం పీఠం పంచుకోవడం గురించి శివసేన విధించిన షరతులకు బీజేపీ అంగీకారం తెలపకపోవడంతో రెండు పార్టీల  మధ్య దూరం పెరిగింది. ఎన్.సి.పి-కాంగ్రెస్‌ కూటమితో కలిసి శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదు. దీంతో ఏ పార్టీకి పూర్తి  మెజారిటీ లేకపోవడంతో రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ సిఫారసు చేశారు. ఫలితంగా ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: