తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పంతం నెగ్గింది. దాదాపు ఒకటిన్నర నెల పాటు నిర్విరామంగా కొనసాగిన ఆర్టీసీ సమ్మె విరమణకు తాము సిద్ధమని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామ రెడ్డి చెప్పడంతో టిఆర్ఎస్ ప్రభుత్వం చివరికి విజయం సాధించినట్లు అయింది. ఎలాంటి షరతులు లేకుండా అనుకూల వాతావరణం కల్పించి ప్రభుత్వం వెంటనే కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తేల్చి చెప్పారు. 

 

అయితే సమస్యలను లేబర్ కోర్టుకు ప్రభుత్వం సత్వరమే నివేదించాలని చెప్పిన ఆయన ప్రభుత్వం ఆర్టీసీని ఒక ఆదర్శ ఉద్యోగ సంస్థగా చూడాలని హై కోర్టు సూచించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమ్మెకు ముందు ఉన్న పరిస్థితులను ఆర్టీసీ ఉద్యోగుల కల్పించి ప్రతి ఒక్కరిని తక్షణమే విధుల్లోకి తీసుకుంటే తాము సమ్మె విరమణకు సిద్ధమని ఆయన అన్నారు. అలాగే కార్మికులు ఎలాంటి పేపర్లు మరియు షరతులు పై సంతకాలు పెట్టరని కూడా స్పష్టం చేశారు. పైకి ఇలా గట్టిగా మాట్లాడుతున్నా అశ్వద్ధామ రెడ్డికి పరిస్థితి చేయి దాటి పోయిందని అర్థమైపోయింది. అందుకే హైకోర్టు తీర్పును గౌరవించే బాధ్యత ఇరుపక్షాలకు ఉందని అంటున్నారు.

 

బుధవారం (నవంబర్ 20, 2019) హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశం అయ్యారు. హైకోర్టు తీర్పు, భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. సమ్మెపై కీలక ప్రకటన చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మంగళవారం(నవంబర్ 19,2019) ఆర్టీసీ కార్మిక సంఘాలు వేర్వేరుగా సమావేశమయ్యాయి. కార్మికుల అభిప్రాయాలను సేకరించారు. వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. కోర్టు తీర్పును పరిశీలించాకే సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన జేఏసీ.. సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నామంది. ప్రభుత్వం, యాజమాన్యం ఆ దిశగా సత్వరమే చర్య తీసుకుంటాయని ఆశిస్తున్నట్లు తెలిపింది.

 

మరో వైపు ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. అలాగే ఆర్టీసీ జేఏసీ బేషరతు డిమాండ్ ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని వెల్లడించింది. అలాగే సమ్మె కాలానికి జీతాలు చెల్లించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం కూడా తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: