తెలుగు బిడ్డ అయిన ప్ర‌శాంత్‌...భారత్‌లో తప్పిపోయి పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన సంగ‌తి తెలిసిందే. ప్రశాంత్, మధ్యప్రదేశ్‌కు చెందిన మరోవ్యక్తి కూడా పాక్‌లో ఇరుక్కుపోయారు. అయితే, ఈ వ్య‌వ‌హారంపై ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. అయితే, ఈ ఎపిసోడ్‌లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రశాంత్ వ్యవహారంలో ఉద్దేశపూర్వకంగా అసత్యప్రచారాలు చేసే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

ఇరుదేశాలకు సంబంధించిన అంశం కావడం వల్ల పాక్ పోలీసుల అదుపులో ఉన్న ప్రశాంత్, మధ్యప్రదేశ్‌కు చెందిన మరోవ్యక్తిపై అవాస్తవాలను ప్రచారం చేయవద్దని సూచించారు. న్యాయప్రక్రియ పూర్తయితేనే వారు విడుదలవుతారని, ఇందుకు సమయం పడుతుందని చెప్పారు. భారత దౌత్యకార్యాలయానికి వారిద్దరి సమాచారాన్ని చేరవేశామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని తప్పకుండా భారత్‌కు తీసుకొస్తాయని సజ్జనార్ ఆశాభావం వ్యక్తంచేశారు. పాక్ నుంచి ప్రశాంత్‌ను క్షేమంగా స్వదేశానికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ఇది చాలా సున్నితమైన అంశం కాబ‌ట్టి ప్ర‌జ‌లు గ‌మ‌నించి, స‌హ‌క‌రించాల‌ని కోరారు. 

 

ఇదిలాఉండ‌గా, హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్, మధ్యప్రదేశ్‌కు చెందిన తన స్నేహితుడితో కలిసి పాక్‌లో ప్రవేశించారు. కాగా, ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రశాంత్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో విధులు నిర్వహిస్తుండగా అతనికి మధ్యప్రదేశ్‌కి చెందిన ఒక అమ్మాయితో(ఆమె కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్) స్నేహం, అది కాస్తా ప్రేమగా మారింది. అనంతరం ఆమె స్వరాష్ట్రం వెళ్లగా, అతడు కూడా ప్రియురాలి కోసం మధ్యప్రదేశ్ వెళ్లాడు. ఆమెకు స్విట్జర్లాండ్‌లో ఉద్యోగం రావడంతో ఆమె అక్కడికి వెళ్లింది. దీంతో, ప్రశాంత్ మనస్తాపానికి గురై ఉంటాడని ఆయన తల్లిదండ్రులు అధికారులకు తెలిపిన విషయం తెలిసిందే. తమ కుమారుడిని తమ చెంతకు చేర్చాలని వారు మంత్రి కేటీఆర్‌కు, అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంత్ అతని స్నేహితుడిని క్షేమంగా రప్పిస్తామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా అతని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: