సీఎం హోదాలో తండ్రి శంకుస్థాపన చేశారు. అదే వంతెనను ఈ రోజు సీఎం హోదాలో తనయుడు ప్రారంభించారు.  లంకవాసుల దశాబ్దాల కల నెరవేర్చారు. రాష్ట్ర విభజన జరిగి... మధ్యలో ప్రభుత్వాలు... ముఖ్యమంత్రులు మారి.. ఎట్టకేలకు వంతెన నిర్మాణం పూర్తైంది. గోదావరి దాటేందుకు లంక గ్రామాల ప్రజలు పడిన కష్టాలు నేటితో తీరిపోయాయి.    

 

తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం పశువుల్లంక-వలసలతిప్ప మధ్య నిర్మించిన హైలెవెల్ బ్రిడ్జి ప్రారంభమైంది. ఈ బ్రిడ్జికి వై.ఎస్.వారధిగా నామకరణం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి శంకుస్థాపనతో 2009లోనే ఈ వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ వారధిని ఈ రోజు ఆయన తనయుడు సి.ఎం. జగన్ ప్రారంభించారు.

 

ఈ లంక గ్రామాల్లో 15 వేల మంది జీవనం సాగిస్తున్నారు. లంక భూముల్లో వీరంతా పంటలు పండించుకుంటారు. ఆ పంటలను బాహ్య ప్రపంచానికి తీసుకొచ్చి అమ్ముకుంటారు. వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. అయితే వీటన్నింటికీ పడవ ప్రయాణమే వారికి శరణ్యం. ఒక వారధి నిర్మిస్తే తమ కష్టాలు నెరవేరుతాయని ప్రజలు ఎదురు చూసేవారు. వై.యస్.ఆర్ మరణంతో బ్రిడ్జి నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రజలు దీనిపై ఆశలు వదిలేసుకున్నారు.

 

2018లో ఇక్కడ పడవ ప్రమాదం జరిగింది. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో పశువుల్లంక-సలాదివారిపాలెం వద్ద సుమారు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బ్రిడ్జి ఫిల్లర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు గల్లంతయ్యారు. రేవుదాటి స్కూలుకు వెళ్లిన పిల్లలు తిరిగి వచ్చే సమయంలో ప్రమాదం జరగడంతో.. ముగ్గురు విద్యార్థినుల ఆచూకీ లభ్యం కాలేదు. 15 రోజులపాటు పెద్దఎత్తున గాలించినప్పటికీ ముగ్గురి ఆచూకీ లభ్యంకాలేదు. దీంతో ఆ కుటుంబాలు తమ వారి చివరి చూపునకు సైతం నోచుకోలేకపోయాయి. 

 

ఈ ప్రమాదం బ్రిడ్జిని పూర్తిచేయాలనే డిమాండ్‌ మొదలైంది. దీంతో అప్పటి సీఎం చంద్రబాబు స్పందించి బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను వేగవంతం చేశారు. అయితే... ఇదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో చివరి దశ పనులు నిలిచిపోయాయి. వైఎస్ జగన్ సీఎం అయ్యాక బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తయ్యాయి. 


మొత్తానికి...వంతెన ప్రారంభమవడంతో లంక గ్రామాలవాసుల కష్టాలు తీరిపోయాయి. చుట్టూ గోదావరి ఉండి బయటి  ప్రపంచంతో సంబంధాలు లేకుండా పోయిన లంక వాసులు వంతెన ప్రారంభమవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: