ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటం ఏ నాయకుడికైనా అవసరం. ఇది కొన్ని సార్లు కష్టంగా కూడా అనిపించవచ్చు. కానీ నాయకుడు మాట తప్పకుండ .. మడమ తిప్పకుండా ఇచ్చిన హామీలను నెరవేరిస్తే జనాలు జై కొడతారు. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతుంది. జగన్ తాను ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. పాదయాత్ర సమయంలోనూ.. ఎన్నికల సందర్భంలోనూ ఇచ్చిన హామీల్ని వరుస పెట్టి అమలు చేస్తున్న జగన్.. గతంలో తానిచ్చిన హామీని ఈ రోజు నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

 

జగన్ తన పాదయాత్రలో మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఏపీలోని మత్స్యకార కుటుంబాలు సముద్రంలో వేట నిషేధ సమయంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతుంటారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకూ సముద్రంలో చేపల వేటను నిషేధిస్తుంటారు. ఈ సమయంలో ఒక్కో మత్స్యకార కుటుంబానికి సాయం కింద రూ.4వేలు మాత్రమే ఇచ్చేవారు. తమకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి పాదయాత్ర సందర్భంగా జగన్ కు తమ గోడును వెల్లబోసుకున్నారు మత్స్యకార కుటుంబాలు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని ప్రకటించారు.

 


దానికి తగినట్టుగానే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వారికి ఆర్ధిక సహాయం చేసేందుకు కార్యాచరణను ప్రారంభించింది. దీనికి తగ్గట్లే తాజాగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోని వైఎస్సార్ మత్య్సకారులకు తానిచ్చిన మాటను గుర్తు చేసుకున్నారు. ఈ రోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ.. గతంలో తానిచ్చిన హామీలు ఈ రోజు నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకూ చేపల వేటపై నిషేధం ఉన్న సమయంలో ఇచ్చే రూ.4వేలకు స్థానే రూ.10వేలను ఇకపై ఇవ్వనున్నట్లు చెప్పారు. తానిచ్చిన హామీని ప్రభుత్వం ఏర్పాటైన ఐదు నెలల్లోనే అమలు చేస్తున్న వైనాన్ని సీఎం జగన్ చెప్పారు.  ఈ హామీ అమలు కారణంగా రాష్ట్రంలోని 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: