ఏపీలో రాజకీయమే కాదు, అటు తెలంగాణా రాజకీయం కూడా ఇప్పట్లో ఎవరికీ అర్ధం కానివి, కొరుకుడుపడనివే. ఏపీలో చూసుకుంటే భారీ మెజారిటీతో వైఎస్ జగన్ అధికారంలో ఉన్నారు. ఆయన్ని కదిపి చూడాలని నేతాశ్రీలకు బడా  కోరికలు మెండుగా ఉన్నా కూడా ఆచరణలో అసాధ్య‌మన్నది  ఎవరికీ తెలియనిది కాదు. అందుకే డబ్బా కబుర్లు చెబుతూ పొద్దు పుచ్చుకుంటున్నారు కమలనాధులు.

 

వెనకటికి లేస్తే మనిషిని కాదు అన్నాడట ఒకడు. అలా ఉంది. బీజేపీ యవ్వారం. ఏపీలో అటు టీడీపీ నుంచి, ఇటు వైసీపీ   నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు బీజేపీ వైపుగా క్యూ కట్టేస్తున్నారుట. కాషాయం పార్టీ కొత్త పూజారి సుజనా చౌదరి సెలవిచ్చారు. మరి అంతలా క్యూ కట్టేతూంటే వారికి ఎందుకు చేర్చుకోవడం  లేదన్నదే ఇక్కడ ప్రశ్న.

 

ఏపీలో అసలు బీజేపీకి ఏముంది. కనీసం నోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయా. ఏపీలో డిపాజిట్ దక్కిన అభ్యర్ధులు ఎంతమంది. అసలు బీజేపీకి ఏపీలో దిగుమతి సరుకు తప్ప జనం నుంచి ఎదిగిన నాయకులు ఉన్నారా. పోనీ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి అవకాశం ఇచ్చారా. ఇవేమీ లేవే. ఏదో పక్క పార్టీల నుంచి వీలైనంతమందిని గుంజుకుందాం అనే ఎత్తులు తప్ప బీజేపీని ఏపీలో ఈ మేరకు అభివ్రుధ్ధి చేశారు.

 

ఇక జనాలను గెలుచుకుంటే బలం దానంతంట అదే పెరుగుతుంది. మరి ప్రత్యేక హోదా ఇచ్చారా, వభజన  హామీల సంగతేంటి, రాజధానికి నిధులు ఇస్తున్నారా , పోలవరం ఎన్నెళ్ళలో పూర్తి చేస్తారు, ఇవన్నీ చెప్పకుండా ఏపీలో అధికారం కావాలి మాకిచ్చేయండీ అంటే బీజేపీకి జనం పట్టం కడుతారా నాయకులు వెళ్ళినా జనం ఓట్లేసే పరిస్థితి బొత్తిగా లేని రోజులు ఇవి. అందువల్ల బీజేపీ నేతలు ముందు జనం మనసు గెలుచుకోవాలి.

 

డబ్బా మాటలు, బెదిరింపు ప్రకటనలు ఆరు నెలలుగా విని జనం నవ్వుకుంటున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు వస్తారు వీరు గోడ దూకుతారు అని చెప్పుకొవడం నీతి నిజాయతీ అని చెప్పుకునే తేడా పార్టీ బీజేపీకి మంచిది కాదేమో, ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. ఆ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్ళి ఏం చేస్తారు, ఏం బావుకుంటారు. చక్క భజన చేస్తారా  కమలం పువ్వులు చెవిలో పెట్టకుండా   కాస్త లాజిక్ తో మాట్లాడితే బాగుంటుందేమో కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: