మహారాష్ట్రలో మూడు పార్టీల మధ్య ఏర్పడుతుందనుకుంటున్న  ప్రభుత్వంలో కాపురానికి ముందే కలతలు మొదలయ్యాయా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అదే అనుమానం పెరుగుతోంది. శివసేన+ఎన్సీపి+కాంగ్రెస్ మధ్య ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది.  288 సీట్లున్న అసెంబ్లీలో   శివసేనకు 56, ఎన్సీపికి 54, కాంగ్రెస్ కు 46 సీట్లు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

 

ముఖ్యమంత్రి కుర్చీకోసం బిజెపి, శివసేనల మధ్య జగడం మొదలవ్వటంతో రెండు విడిపోయాయి. దాంతో శివసేన కాంగ్రెస్+ఎన్సీపితో జత కట్టేందుకు రెడీగా ఉంది. నిజానికి శివసేనతో మిగిలిన రెండు పార్టీలకు ఏమాత్రం పోలిక లేదు. శివసేనేమో అచ్చంగా జనాల్లో భావోద్రేకాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే పార్టీ. అలాంటి పార్టీతో జతకట్టడమంటే కత్తితో తల గోక్కోవటమే.

 

సరే ఏదో పరిస్ధితుల ప్రభావం కారణంగా మూడు పార్టీల మధ్య ఇపుడు చర్చలు జరుగుతున్నాయి. సూత్రప్రాయంగా మూడు పార్టీలు కలవటానికి కాంగ్రెస్ కూడా ఓకే చెప్పింది. కానీ ఇక్కడే పేచి కూడా మొదలైంది. అదేమిటంటే హిందుత్వ అజెండాను శివసేన భుజానికెత్తుకోకూడదంటూ సోనియాగాంధి షరతు పెట్టారట.

 

అలాగే అయోధ్యలో రామాలయ నిర్మాణమని, రామజన్మభూమి అని, జమ్మూ-కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు లాంటి అంశాలను శివసేన ప్రస్తావించకూడదనే కండీషన్లు పెట్టారట. చివరగా మూడు పార్టీల సంకీర్ణంతో ఏర్పడే ప్రభుత్వానికి ’మహశవ అఘాడీ’ అనే పేరు పెట్టబోతున్నట్లు శివసేన చెప్పిందట. దానికి కాంగ్రెస్, ఎన్సీపీలు అభ్యంతరం పెడుతున్నాయి. మహాశివ అఘాడీ అని కాకుండా ’మహా వికాస్ అఘాడి’ అని సూచించిన పేరును శివసేన వ్యతిరేకిస్తోందట.

 

అలాగే తమ తరపున ఆదిత్య ఠాకరే ముఖ్యమంత్రిగా ఉంటాడని శివసేన చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందట. ఆదిత్య ఠాక్రేకి వయస్సు, అనుభవం లేని కారణంగా ఉధ్ధవ్ ఠాక్రే అయితే తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసిందట. మొత్తానికి ఇటువంటి కలతలను సర్దుబాటు చేసుకునేందుకు ముంబాయ్ లో మూడు పార్టీల కీలక నేతల చర్చలు జరుగుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: