ఇన్నాళ్లు ఎంతో మంది సమైక్యవాదులంతా చేసింది వేస్ట్, వారిదంతా సమైక్య ఉద్యమం కాదు, వారు ఇన్నాళ్లు పోరాడింది సమైక్యం ముసుగులో తెలంగాణ ఏర్పాటు కోసమే, అసలైన సమైక్యవాదిని నేనే, నేనే తెలంగాణ ఏర్పడకుండా అడ్డుకుంటాను అని టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టం చేసారు. ఆయన ఇన్నేళ్లుగా సాగిస్తున్న సుదీర్ఘ రాజకీయ యాత్రలో ఎన్నడు లేనంతంగా గుడ్లురిమాడు, చేతులెత్తాడు, ఆగ్రహంతో ఊగిపోయాడు, విభజన అడ్డుకునేందుకు ఏం చేయాలో అది చేస్తాం అంటూ నిప్పులు చెరిగాడు. దీంతో ఈ చచ్చు రాజకీయాలు తెలియని సాధారణ సమైక్యవాదులు, సీమాంద్ర జనం ఏపుట్టలో ఏపాముందో చంద్రబాబైనా తమకు న్యాయం చేస్తాడేమో, తెలుగువారందరిని ఏకంగానే ఉంచుతారేమో... అంటూ ఏదో మూలన ఆశలను మళ్లీ పెంచుకుంటున్నారన్న భావం టిడిపి శ్రేణుల్లో కలిగిందేమో తెలియదు కాని పేషంట్ గుండె ఆగిపోయినంత పనై ఆక్సీజన్ తో ప్రాణం కొట్టుకుంటున్న సమయంలో అయ్యో తప్పు చేసాం అంటూ కళ్లు తెరిస్తే ఆ పేషెంట్ ఎన్నాళ్లు బతుకుతాడు అంటారే తప్ప ఆయన చనిపోకుండా ఉంటారు అని బుద్దోన్నోడెవడు అనుకోడన్న విషయాన్ని ఆ రాజకీయ చాణక్యుడు చంద్రబాబు, ఆయన టిడిపి బృందం మాత్రం అర్థం చేసుకోవాలి అన్న భావం ఆయన ప్రత్యర్థుల్లో నెలకొంది. కారణం విభజన ప్రక్రియ జరిగేంత వరకు కూడా చంద్రబాబు విభజనకు వ్యతిరేకం అనలేదు సరికదా, తెలంగాణ ఏర్పాటుకు అనుకూలం అని అది అయిపోయాక నెత్తి నోరు బాదుకుంటే ఎలా నమ్ముతారన్నది అసలు ప్రశ్న. పోని నమ్ముతారు ఎప్పుడు.... విభజనను ఆయన ఎలా అడ్డుకుంటారో చెప్పినప్పుడు, కాని ఇప్పుడు కూడా ఆపుతాను అంటారే తప్ప ఎలా ఆపుతారో మాత్రం చెప్పడంలేదు. పోని ఆయన అన్నది ఏమిటి, కేసిఆర్, జగన్ లు సోనియా కాళ్లవద్ద మోకరిల్లి రాష్ట్రాన్ని ముక్కలు చేసారు అన్నారు, ఆ పని చేయకుండా ఉన్న చంద్రబాబు ఎందుకు తెలంగాణకు అనుకూలమంటూ ఎంతో కాలం పాట పాడారు అంటే ఆయన వద్ద సమాధానం ఉందా... అన్నది ప్రత్యర్థుల ప్రశ్న. పోని ఇప్పటికి తెలంగాణ రాకుండా ఉండేందుకు ఓ అవకాశం ఉంది. అదేంటంటే పార్లమెంట్ లో బిల్లు పాస్ కాకుండా అడ్డుకోవడం. దానికి నిజంగా మనస్పూర్తిగా ప్రయత్నిస్తున్నారా, లేక షోపుటప్ కోసం ప్రయత్నిస్తున్నారా... అన్నదానిని పక్కన బెడితే రాష్ట్రాలను పట్టుకుని తిరుగుతూ అన్ని పార్టీల కాళ్లావేళ్లా పడుతున్నారు జగన్. మరి చంద్రబాబు ఏం చేస్తున్నారు, ఉన్న చోట కూర్చుని నిప్పులు కక్కడం తప్ప. ఆమరణ నిరాహార దీక్ష చేసింది కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని కాదు, సమన్యాయం చేసి విభజించండి అని. ఇప్పుడు ఇలా రంకెలు వేస్తే ఏం లాభం అన్న ప్రశ్న అందరిలో మెదలడం సహజమే కదా. అంతెందుకు ఆయన బిజేపితో జత కడుతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి బిజేపి ఒక్కటి తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తే చాలు తెలంగాణ 99శాతం ఆగిపోతుంది. కాని చంద్రబాబు ఆ ప్రయత్నం చేసిన పాపానా పోవడం లేదు. ఇప్పటికి బిజేపి తాము తెలంగాణ బిల్లును ఆమోదిస్తాం, అది రాకుండా చూసేందుకు ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతివ్వం అని ఖరాఖండిగా చెప్పేసింది. అయినా సరే బిజేపిని ఒక్క మాట అనడం లేదు. కేసిఆర్ అంటారా, ఆయన లక్ష్యమే తెలంగాణ, అది సాదించారు. ఇక జగన్ అంటారా, ఆయన ఓ ప్రాంతానికి పరిమితమైన పార్టీ నేత, ఆయన అడ్డంగా పడితే తెలంగాణ రాదు అని చంద్రబాబు చెబుతున్నారంటే, అంత కన్న పెద్ద పార్టీగా తెలుగుదేశం అడ్డం పడితే విభజన ఎందుకు ఆగదు అంటే చంద్రబాబు ఏం చెబుతారు. అందుకే చేసిందంతా చేసి ఇప్పుడు రంకెలేస్తే పలితం ఉండదు సరికదా పత్తాలేకుండా చేస్తారేమో అన్న భావమే వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: