బీజేపీ నాయకుడు ఎంపీ సుజనా చౌదరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మూకుమ్మడిగా విమర్శల దాడి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలపై వారు తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు రెడ్డప్ప, నందిగం సురేష్, ఇతర ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ సుజనా చౌదరితోపాటు టీడీపీ అధినేత చంద్రబాబుపైనా ధ్వజమెత్తారు. 

 

   తమ పార్టీ ఎంపీలపై అసత్యాలు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. మీతో ఎవరు టచ్‌లో ఉన్నారో చెప్పాలంటూ సుజనా చౌదరిని ప్రశ్నించారు. టీడీపీ వాళ్లే సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సుజనా నువ్వు బీజేపీలో ఉన్నావా? లేక టీడీపీలో ఉన్నావా? అంటూ ప్రశ్నించారు. 

 

 ఏపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ అవుతుందని అన్నారు. అర్ధగంటలోనే వైసీపీలోకి వచ్చేస్తారని చెప్పారు. చంద్రబాబులా అంత నీచమైన పని జగన్ చేయరని అన్నారు. ఐదు నెలలుగా ఏపీలో జరుగుతున్న అభివృద్ధి టీడీపీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఇసుక అమ్ముకుని బతికిన ఘనత టీడీపీదేనని ఆరోపించారు. 

 

   సుజనా చౌదరి ఎవరు అని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే బ్యాంక్ దొంగ అని వస్తుందని అన్నారు. ఆయన తన పబ్బం గడుపుకోవడానికి వైసీపీ ఎంపీలపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. బ్యాంకులకు రూ. 6వేల కోట్లు ఎగ్గొట్టిన దానిపై సుజనా చౌదరి మాట్లాడాలని డిమాండ్ చేశారు. తాము చివరి వరకు వైసీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. టీడీపీ చచ్చిపోయింది.. ఎంగిలి మెతుకులు తినే సుజనా చౌదరిలా వైసీపీలో ఎవరూ లేరని అన్నారు. ఏపీలో టీడీపీ చచ్చిపోయిందని, భవిష్యత్‌లో కూడా బతికే అవకాశమే లేదన్నారు. ఇంగ్లీష్ మీడియంపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీలో ఉంటూ టీడీపీ నాయకుడిలా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. 

 

   మీలా బ్యాంకులకు కన్నాలు వేసే వాళ్లం కాదు. పైసా ఖర్చు చేయకుండా మేం ఎన్నికల్లో గెలిచాం. ఏపీని సూట్ కేసుల చంద్రబాబు దోచుకున్నారు. మీ పాలనలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనం ఎందుకు కట్టలేదు' అని వైసీపీ ఎంపీలు ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్రబాబు.. రాష్ట్ర విభజనకు కారణమయ్యాడని మండిపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: