దేశంలో నానాటికీ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయనిపిస్తోంది. కర్ర ఉన్న వాడిదే బర్రె అన్న  నీతి అమలవుతోంది. పేరుకు ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నా అధికారం ఎవరి వద్ద వుంటే వారే బలవంతులుగా మారిపోతున్నారు. ఓ విధంగా విలువలకు పాతర వేస్తున్నారు. మహారాష్ట్ర రాజకీయాలను చూసి ఎవరైనా చాణక్యం అంటారా. చవకబారుతనంగా చూస్తారా..

 

ఒక విధంగా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ నయం అనిపించేలా ఇపుడు పరిస్థితులు ఉన్నాయి. శభాష్ అంటూ చేతులెత్తేసేవారు ఉంటే దీన్ని అంతా రాజకీయ తెలివిడిగా, వ్యూహంగా అనుకోవచ్చేమో కానీ రాజ్యాంగా  విలువలు, పద్ధతులు ఎక్కడైనా పాటించారా అన్నది చూస్తే మాత్రం బాధాకరం అనిపిస్తుంది. మహారాష్ట్రలో ప్రజల తీర్పు చూస్తే బీజేపీ, శివసేన కూటమికి  సింపుల్ మెజరిటీ ఇచ్చారు.

 

అయితే ఆ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఫలితాలు వచ్చిన నెల రోజుల పాటు రెండు పార్టీలు సాగించిన రాజకీయ నాటకాలు దారుణాతిదారుణమనే చెప్పాలి.  ఇక శివసేన తీరు కూడా ఏమంత బాగా లేదు. మూడు శతాబ్దాల క్రితం హిందుత్వ కార్డుతో మహారాష్ట్ర రాజకీయ తెర మీద ఎంట్రీ ఇచ్చిన శివసేన జీవితంలో ఒకమారు ముఖ్యమంత్రి పదవి చేపట్టింది. అది 1995 నుంచి 1999 మధ్య కాలం. ఆ తరువాత బీజేపీ గత అయిడేళ్ళ పాటు అధికారంలో ఉంది. ఈ మధ్య అంతా కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలే  పవర్లో ఉన్నాయి.

 

మరి రెండు కూటములుగా విడిపోయినా మహా రాజకీయంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పుని ఖూనీ చేయడానికి ఎవరి మటుకు వారు ప్రయత్నాలు చేశారనే చెప్పాలి. సిధ్ధాతాలు పక్కన పెట్టి శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్ లతో పొత్తులు కలిపితే నాలుగు ఆకులు ఎక్కువ చదివిన బీజేపీ ఇపుడు ఏకంగా ఎన్సీపీని చీల్చేసి మరీ సర్కార్ ఏర్పాటు చేసింది. అయినా మెజారిటీ సరిపోకపోతే కాంగ్రెస్, శివసేనల పని పట్టడానికి సిధ్ధంగా ఉంది. దాంతో క్యాంప్ రాజకీయాలు అక్కడ మొదలైపోయాయి.

 

ఇక రాష్ట్రపతి పాలన అంటూ అన్నాక అది ఎపుడు ఎత్తేశారు. ఎపుడు ప్రమాణం చేయించారన్నది పెద్ద సస్పెన్స్. అంత ఆదరాబాదరాగా ప్రమాణం చేయించాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ అగ్రనేతలు నిగ్గదీస్తున్నారంటే అర్ధముందిగా. అయినా సరే  దర్జాగానే ఈ పని చేయవచ్చు కదా. ఎలాగూ కొనుగోళ్ళకే దిగిపోతున్నపుడు చేసిన పని అయినా సవ్యంగా చేయవచ్చు కదా. ఇంత కధా నడిపిన బీజేపీ పెద్దలు ఇపుడు అభినందనలు, ప్రజలూ తీర్పు అంటున్నారు. 

 

నిజానికి రెండు వారాల‌ క్రితం మాకు మెజారిటీ  లేదు అని మడి కట్టుకుని కూర్చున్న బీజేపీకి ఇపుడు హఠాత్తుగా  అంత మెజారిటీ ఎలా వచ్చింది. ఇది ప్రజాస్వామ్యం పరిహాసం కాదా అంటున్నారు   సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. మొత్తం మీద అన్నింటా దిగజారి బీజేపీ  సర్కార్ ఏర్పాటు చేసినా ఫలితం ఉంటుందా. రాజకీయ దాదాగా ఉన్న అజిత్ పవార్ ని పక్కన పెట్టుకుని మంచి పాలన బీజేపీ అందించగలదా. ఇది జనంలో వస్తున్న సూటి ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి: