ఆమె పేరు స‌త్య‌వేణి. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు ఊరు. ఉన్న ఊర్లో కంటే హైద‌రాబాద్‌లో అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని... సత్యవేణి ఉపాధికోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఆమె తన అక్క ఉండే కాలనీకి నివాసం మార్చే క్రమంలో అద్దె ఇంటిని వెతకడం కోసం కూతురుతో కలిసి మణికొండనుంచి బయలుదేరారు. బయో డైవర్సిటీ జంక్షన్‌కు వచ్చి ఆటోలో హైదర్‌నగర్ వెళ్లడానికి నిలబడి ఉండగా, ఫ్లై ఓవర్ పైనుంచి కారు నేరుగా ఆమెపైనే పడటంతో మృత్యువాత పడ్డారు. ఆటోకోసం అక్కడ నిలబడటంవల్లే ఆమెకు ప్రమాదం జరిగిందని బంధువులు విలపించారు. ఉపాధి కోసం ఉన్న ఊరు వ‌దిలి వ‌చ్చిన స‌త్య‌వేణి ఇలా ఆక‌స్మికంగా ఊపిరి వ‌దిలారు. 

 

ఆమె పేరు మౌనిక‌. తెలంగాణ‌లోని మంచిర్యాల జిల్లా వాసి.  ఏడాది క్రితమే పెళ్లి జరిగింది. భర్తకు హైదరాబాద్‌లో ఉద్యోగం రావడంతో ఇద్దరూ కలిసి నగరానికొచ్చి నివాసం ఉంటున్నారు.డిగ్రీ పూర్తి చేసిన మౌనిక చిన్నాన్న కూతురు నిఖిత ఉద్యోగం కోసం నగరానికి రావడంతో ఆమెను హాస్టల్‌లో ఉంచేందుకు అమీర్‌పేటకు వచ్చింది. ఆదివారం సెలవు రోజు కావడంతో భర్త ఇంట్లోనే ఉండగా ఆమె ఒక్కతే కూకట్‌పల్లి నుంచి మెట్రోలో అమీర్‌పేటకు వచ్చింది.  వర్షం కురుస్తుండటంతో మహిళ స్టేషన్ మెట్ల దగ్గర నిలబడింది. ఈలోపు రెయిలింగ్ ఒక్కసారి ఊడి ఆమెపై పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు.. అక్కడ చికిత్సపొందుతూ చనిపోయింది.  అటు భర్త, ఇటు చెల్లెలు మౌనిక మృతిని తట్టుకోలేకపోయారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు కోసం ఉన్న ఊరిని, కన్న వారిని వదిలి వచ్చిన వారి జీవితాల్లో ఈ విషాదం తీరని శోకాన్ని నింపింది.

 

ఇవి హైద‌రాబాద్‌లో జ‌రిగిన రెండు `ప్ర‌మాదాలు`. ఈ రెండు ఘ‌ట‌న‌ల్లో క‌న్నుమూసింది ఇద్ద‌రూ మ‌హిళ‌లే. ఇద్ద‌రూ అమాయ‌కులే. త‌మ త‌ప్పేమీ లేకున్నా....దారుణంగా క‌న్నుమూసిన వారే. మ‌ద్యం సేవించ‌డమో...మితిమీరిన వేగంతో వాహ‌నం న‌డ‌ప‌డ‌మో...అడ్డ‌దారిలో ప్ర‌యాణించ‌డ‌మో కాదు వారు చ‌నిపోయేందుకు కార‌ణం. నిర్ల‌క్ష్యం. కేవ‌లం నిర్ల‌క్ష్యం! మొద‌టి ఘ‌ట‌న‌లో అతివేగంతో వ‌చ్చిన కారు డ్రైవ‌ర్‌, కీల‌క‌మైన ఫ్లై ఓవ‌ర్ విష‌యంలో త‌గు జాగ్ర‌త్త తీసుకొని నిర్మాణం చేయ‌ని వారిది... రెండో ఘ‌ట‌న‌లో స‌రైన ప్ర‌మాణాలు పాటించ‌కుండా మెట్రో రెయిలింగ్ నిర్మించిన వారిది. స‌రే వారి నిర్ల‌క్ష్యం అలా ప‌క్క‌న‌పెడితే... ఈ ఇద్ద‌రు ఆడ‌బిడ్డ‌ల కుటుంబాలు ఎదుర్కుంటున్న క్షోభ‌కు ప‌రిష్కారం ఏంటి?  త‌మ వారిని కోల్పోయిన కుటుంబ‌స‌భ్యుల ఆవేద‌న‌ను ఎవ‌రు తీరుస్తారు? ఇవ‌న్నీ శేష ప్ర‌శ్న‌లే. అందుకే...హైద‌రాబాద్‌లో రాబోయే కాలంలో ఇలాంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌వ‌చ్చు..జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు కూడా. కానీ...మీ ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే...మీ జాగ్ర‌త్త‌లో మీరు ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: