మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు మ‌రింత హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ అండతో శ‌నివారం ఉద‌యం నాట‌కీయ ప‌క్కీలో బీజేపీ-శివ‌సేన (!) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కొష్యారీ సమక్షంలో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్‌, డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ ప‌రిణామంపై రాజ‌కీయ దుమారం రేగుతోంది. బీజేపీ, అజిత్ పవార్‌ను మభ్యపెట్టి అతని సహకారం తీసుకుందనీ.. ఈ ప్రభుత్వం మూడు రోజుల ముచ్చటేనని ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ మండిపడ్డాయి. అంత‌టితో ఆగ‌కుండా...గవర్నర్ భగత్‌సింగ్ కొశ్యారీ రాజ్యాంగానికి విరుద్దంగా, బీజేపీ కోవర్టుగా మారారని అతనిపై, బీజేపీపై చర్యలు తీసుకోవాలని శివసేన, ఎన్సీపీ- కాంగ్రెస్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

 

అయితే, ఇటు రాజ‌కీయ దుమారం...అటు న్యాయ‌స్థానంలో పోరాటంతో పాటుగా ఎన్‌సీపీ-శివ‌సేన‌లు త‌మ జాగ్ర‌త్త‌లు తాము తీసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్ర‌కారం బ‌ల‌ప‌రీక్ష జ‌రిగే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో...త‌మ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం ఎన్సీపీ వారిని ముంబయిలోని లలిత్ హోటల్‌లో ఉంచింది. ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్ వారితో స‌మావేశ‌మయ్యారు.  ఈ సమావేశానికి శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే, సంజయ్‌రౌత్ హాజరయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఆందోళన చెందవద్దనీ.. మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని శ‌ర‌ద్ ప‌వార్‌తో పాటు ఉద్దవ్ వారికి భరోసా ఇచ్చారు. మ‌రోవైపు ఇదే సందర్భంగా ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్‌తో రహస్య భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఎలా ముందుకు వెళ్లాల‌నే అంశంపై ఇద్ద‌రూ కీల‌క చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది.

 

ఇక స‌ర్కారు ఏర్పాటు చేసిన బీజేపీ ఫుల్ జోష్‌లో ఉంది.  భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఇవాళ ముంబయిలో జరిగింది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవ‌గా..ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్, బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోయ‌ల్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ, ఎన్‌సీపీ నేత అజిత్‌పవార్ కూటమి సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సంతోషదాయకమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన అజిత్ పవార్‌కు ఆశీస్సులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీకి, పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. మహారాష్ట్ర ప్రజల సంక్షేమానికి స్థిరమైన ప్రభుత్వం ఉండేలా కృషి చేస్తానని సమావేశంలో ఆయన తెలిపారు.

 

మ‌రోవైపు మ‌హారాష్ట్ర రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు విప‌రిణామాల‌కు సైతం దారితీస్తున్నాయి. శివసేన అధినేత‌ ఉద్దవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి కావడం లేదని మనస్థాపం చెందిన రమేశ్‌ బాలు అనే శివసేన కార్యకర్త మనోరా చౌక్‌లోని యమంత్‌ మాల్‌ వద్ద ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన కార్యకర్తలు రమేశ్‌ బాలును అడ్డుకున్నారు. రమేశ్‌ బాలు వశీం జిల్లావాసి. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: