ఇటీవ‌లే తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి జంప్ చేసిన రాజ్య‌స‌భ స‌భ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రి సంచ‌ల‌న ప‌రిణామాల‌తో వార్త‌ల్లో నిలుస్తున్నారు. మొన్నటి వరకు టీడీపీ  నేతలతో రహస్య మంతనాలు కొనసాగించిన సుజనా చౌదరి ఇప్పుడు వైసీపీ ఎంపీలకు గాలమేసే పనిలో పడ్డారని ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీకి చెందిన పలువురు ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని సుజనా చేసిన ప్రకటన క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. న్యూఢిల్లీలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతుండ‌టం...ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఎంపీలంతా హస్తినలోనే మకాం వేసిన త‌రుణంలో... సుజనాచౌదరి ఈ మాట‌లు అన‌డం వెనుక లాజిక్ ఏంట‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. స‌హ‌జంగానే కొంద‌రు వైసీపీ ఎంపీల‌పై అనుమాన‌పు చూపులు చూస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పార్టీకి చెందిన ఓ ఎంపీ ఘాటు కౌంట‌రే ఇచ్చారు. 

 

సుజనా చౌదరి తాజాగా చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కాక పుట్టిస్తోంది. పార్లమెంటు సెషన్ నేప‌థ్యంలో త‌మ‌తో కొంద‌రు వైసీపీ ఎంపీలు ట‌చ్‌లోకి వ‌చ్చార‌నేది ఆ ప్ర‌క‌ట‌న సారాంశం. ఢిల్లీలో సుజ‌నా చౌద‌రి మీడియాతో మాట్లాడుతూ...వైసీపీ నుంచి మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు తమ టచ్‌లో ఉన్నట్లు చెప్పారు. వారు తమతో ట‌చ్‌లో ఉన్న‌ప‌టికీ  ఇప్పటికిప్పుడు బీజీపీలో చేర్చుకోబోమని తెలిపారు. ఇంత‌కీ బీజేపీతో ట‌చ్‌లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరని మీడియా ప్రశ్నించగా ఇప్పుడు చెప్పడం అప్రస్తుతమని, తగిన సమయం, సందర్భం వచ్చినప్పుడే పార్టీలో వారిని చేర్చుకుంటామన్నారు. దీంతో సుజ‌నా కేంద్రంగా బీజేపీ పెద్ద‌లు భారీ యాక్షన్ ప్లాన్‌కు పార్ల‌మెంట్‌ సెషన్‌లోనే శ్రీకారం చుట్టారని ప్ర‌చారం జ‌రుగుతోంది.

 


అయితే, బీజేపీకి టచ్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఉన్నారంటూ ఎంపీ సుజనాచౌదరి చేసిన వ్యాఖ్యలపై రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ స్పందించారు. సుజనాచౌదరి మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో కూర్చున్న ఎంపీలను చూసి వైఎస్సార్‌ సీపీ ఎంపీలు టచ్‌లో ఉన్నారనుకుంటున్నారని పేర్కొన్నారు. నిజమైన వైఎస్సార్‌ సీపీ ఎంపీలు కడవరకూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటారని ఎంపీ భరత్‌రామ్ స్ప‌ష్టం చేశారు. మొత్తంగా సీనియ‌ర్ నేత‌లు సైతం ఇవ్వ‌ని కౌంట‌ర్‌ను జూనియ‌ర్ అయిన భ‌రత్ ఇచ్చార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: