రాజధాని ప్రాంతంలో టిడిపి హయాంలో మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు వేలాది ఎకరాలు కొన్నారా ? అమరావతి ప్రాంతంలోని దళిత రైతులు మీడియా మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ హయాంలో  నేతలు 9 వేల ఎకరాలు కొన్నట్లు చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుండి భూములు తీసుకున్న చంద్రబాబు రైతులకు ప్లాట్లు ఇచ్చారట. అయితే రైతులకిచ్చిన ప్లాట్ల మధ్య 25 లక్షల గజాలు హోల్డులో పెట్టినట్లు మండిపడ్డారు.

 

పై రెండు విషయాలు రైతులు చెప్పేంత వరకూ చాలామందికి తెలీదనే చెప్పాలి. నిజానికి రైతులకిచ్చిన ప్లాట్ల మధ్య 25 లక్షల గజాలు హోల్డులో పెట్టటమన్నది చిన్న విషయం కాదు. లక్షలాది గజాలు చంద్రబాబు అప్పట్లో  ఎవరి కోసం హోల్డులో పెట్టినట్లు అన్నది తేలాలి. అలాగే మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు మొత్తం 9 వేల ఎకరాలు కొన్నట్లు చెప్పటమంటే మామూలు విషయం కాదు.

 

టిడిపిలో నారా లోకేష్ అండ్ కో వేలాది ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు పెద్ద ఎత్తున వైసిపి ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తోంది. ఇన్ సైడర్  ట్రేడింగ్ కు పాల్పడి భారీ ఎత్తున భూములు కొన్నారు అని మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, సుజనా చౌదరి లాంటి అనేకమందిపై వైసిపి నేతలు ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఆ ఆరోపణలనే ఇపుడు దళిత రైతులు కూడా చెప్పారు. అంటే రైతులు చెప్పినదానిలో  9 వేల ఎకరాలు, 25 లక్షల గజాలు అని చెప్పారు. 9 వేల ఎకరాల్లోనే 25 లక్షల గజాలు కూడా కలిసుందా ?  లేకపోతే 9 వేల ఎకరాలు వేరు, 25 లక్షల గజాలు వేరా ? అన్నది తేలాలి. ఈనెల 28వ తేదీన చంద్రబాబు అమరావతి ప్రాంతంలో పర్యటించే ముందు రాజధాని ప్రాంత దళితరైతులు చంద్రబాబుపైన, నేతలపైన పెద్ద ఎత్తున మండిపోవటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: