అక్టోబర్‌ 5వ తేదీన ప్రారంభమైన ఆర్టీసి సమ్మె.. 52 రోజుల పాటు కొనసాగిన సమ్మెకు ఈరోజు ఆర్టీసి జేఏసీ స్వస్తి పలికింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించి సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. రేపు ఉదయం 6 గంటలకు కార్మికులు విధుల్లో చేరుతారని జేఏసీ నాయకుడు అశ్వథామరెడ్డి ప్రకటించారు. కార్మికులు సమ్మె విరమణ కాపీని ఆర్టీసి ఎండి కార్యాలయానికి వెళ్లి ఇవ్వబోగా కార్యాలయం తిరస్కరించింది. 

సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతల ప్రకటన హాస్యాస్పదమని ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ అన్నారు. యూనియన్ల మాట విని కార్మికులు నష్టపోయారని సునీల్ శర్మ పేర్కొన్నారు. ఇష్టమొచ్చినపుడు గైర్హాజరై.. ఇప్పుడు చేరతామంటే కుదరదని ఆయన వ్యాఖ్యానించారు. ఇష్టానుసారం చేస్తామంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో సాధ్యంకాదని చెప్పారు. లేబర్ కోర్టు లో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కార్మికులు సంయమనం పాటించాలని సునీల్ శర్మ కోరారు. డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు సునీల్ శర్మ. కార్మికులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని పేర్కొన్నారు. ఇక ఆర్టీసి నిర్ణయంపై కార్మికులు యూనియన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

ఇక అంతకు ముందు ఆర్టీసి జేఏసీ నేత అశ్వథామరెడ్డి "ఆర్టీసీ సంస్థను రక్షించడంతో పాటు, కార్మికుల హక్కుల రక్షణ కోసమే పోరాటం చేశామని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. సమ్మెకు సహకరించిన కార్మికులకు, రాజకీయ పార్టీలకు, విద్యార్థి సంఘాలకు, ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఇది పోరాటానికి నాంది  మాత్రమేనని పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని, కార్మికుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని సమ్మె విరమించినట్టు" వెల్లడించారు. అలాగే తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు రేపు విధులకు రావద్దని విజ్ఞప్తి చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు జేఏసీ అండగా ఉంటుందని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: