ఏపీలో అసెంబ్లీ సీట్లు పెంచేందుకు కేంద్రంలోకి బీజేపీ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏపీతో పాటు తెలంగాణాలోనూ అదనంగా సీట్లు పెరుగుతాయి. విభజన చట్టం ప్రకారం ఏపీలో ఉన్న 175 సీట్ల నుంచి 225 సీట్లకు పెంచుతారు. అలాగే తెలంగాణాలో 119 సీట్ల నుంచి 153 వరకూ  సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ సీట్ల పెంపు కోసం నాడు చంద్రబాబు ఎంతలా ప్రయత్నం చేశారో అందరికీ తెలిసిందే.

 

అదే విధంగా కేసీయార్ సైతం సీట్ల పెంపు కోసం తనదైన వ్యూహంతో నాడు పలుమార్లు కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారు. అయితే నాడు బీజేపీ మాత్రం ససేమిరా అనేసింది. దానికి కారణం ఇటు చంద్రబాబు, అటు కేసీయార్ ఇద్దరూ పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించి తమ‌ పార్టీల్లో కలుపుకున్నారు.  ప్రతిపక్షాలను బలహీనం చేసే రాజకీయం నడిపారు. అందువల్ల వారికి కనుక అవకాశం ఇస్తే మొత్తం చిత్తు అవుతామని నాడు ఈ ఫైల్ ని బీజేపీ తొక్కిపెట్టిందని అంటారు.

 

ఇక 2024లో ఏపీ, తెలంగాణాలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ ఇపుడు తనకు అనుకూలం చేసుకునేందుకు సీట్ల పెంపును ముందుకు తెస్తోందని అంటున్నారు. సీట్లు ఎంత ఎక్కువగా పెరిగితే బీజేపీకి అంత లాభమని అంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకోవడమే కాకుండా రేపు కూటములు కట్టినా కూడా  తనకు పోటీ చేయడానికి పెద్ద ఎత్తున సీట్లు ఉంటాయని బీజేపీ భావిస్తోంది. దాంతో పాత ఫైల్ దుమ్ము దులుపుతోందని అంటున్నారు. అయితే సీట్ల పెంపు ఎపుడూ అధికార పార్టీలకు అనుకూలమని, ఆ విధంగా ఆలోచించినపుడు ఇటు జగన్, అటు కేసీయార్ కూడా ఇతర పార్టీల నుంచి వలలనను పెంచి తమ బలం పెంచుకుంటారని అంటున్నారు. మరోవైపు  బీజేపీ సీట్ల పెంపు వల్ల ఏపీ, తెలంగాణాలో టీడీపీ, కాంగ్రెస్ వంటి  విపక్షాలు దారుణంగా దెబ్బ తింటాయని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: