`మ‌హా`మాయ‌లో ఉత్కంఠ కొన‌సాగుతోంది. గ‌త శనివారం ఉదయం రాష్ట్రపతి పాలనను ఎత్తివేయడం, ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్‌పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం, బలపరీక్షకు రెండు వారాల గడువు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మహారాష్ట్ర వికాస కూటమి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ కొనసాగింది. జస్టిస్‌లు ఎన్వీ రమణ, అశోక్ భూషణ్, సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం వాదనలను విన్నది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తరఫున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్, బీజేపీ, పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, కేంద్రం, గవర్నర్ కార్యదర్శి తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కూటమి తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ఏఎం సింఘ్వీ వాదనలు వినిపించారు.మహారాష్ట్రలో బలపరీక్ష నిర్వహణపై మంగళవారం ఉదయం 10:30 గంటలకు తీర్పు ఇవ్వనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది.

 

అయితే, ఇలాంటి రాజ్యాంగ సంక్షోభం సంద‌ర్భాల్లో గ‌తంలో కోర్టు ఏమ‌ని తీర్పిచ్చింది?  ఆయా రాష్ట్రాల‌కు సంబంధించిన అంశాల్లో ఏం జ‌రిగింద‌నేది..స‌హ‌జంగానే ఆస‌క్తిని రేకెత్తించే అంశం. 1998 నాటి ఉత్తర్‌ప్రదేశ్‌లో జగదాంబికా పాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఆ తర్వాత గోవా, ఝార్ఖండ్, ఇటీవల కర్ణాటక విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కాంగ్రెస్, శివసేనలు ఉదాహరణగా చూపుతున్నాయి. 

 

మ‌రోవైపు ఈ ఉదంతంలో గ‌వ‌ర్న‌ర్‌ను ప‌లు అంశాలు వేలెత్తి చూపుతున్న‌ప్ప‌టికీ...అవి రాజ‌కీయంగా నిల‌బ‌డుతాయే త‌ప్ప రాజ్యాంగ‌ప‌రంగా కావ‌ని కోర్టులో జ‌రిగిన వాద‌నలు స్ప‌ష్టం చేస్తున్నాయి. మ‌హారాష్ట్ర గవర్నర్ కార్యదర్శి తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. తాము ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ బీజేపీ గవర్నర్‌కు సమర్పించిన లేఖను, ఫడ్నవీస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ ఇచ్చిన లేఖను ధర్మాసనానికి సమర్పించి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి జరిగిన పరిణామాలను వివరించారు. గవర్నర్ నిబంధనల మేరకే నడుచుకున్నారని స్పష్టం చేశారు. వరుసగా బీజేపీ, శివసేన, ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని, ఎవరూ ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించారని చెప్పారు. ఈ నెల 23న తన విచక్షణ మేరకు అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని చెప్పారు. 54 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు తెలుపుతున్నారని, ఈ మేరకు ఆ పార్టీ శాసనసభాపక్షనేత అజిత్‌పవార్ లేఖ ఇచ్చారని తెలిపారు. గవర్నర్ వీటి ఆధారంగానే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు బలపరీక్షే గీటురాయి అనేది అందరూ ఒప్పుకోవాల్సిందేనని, అయితే 24 గంటల్లోగా బలపరీక్ష నిర్వహించాలని ఎవరూ డిమాండ్ చేయలేరని చెప్పారు. గవర్నర్‌కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సమాధానమిచ్చేందుకు రెండు మూడు రోజుల సమయం కావాలని కోరారు. అంటే గ‌వ‌ర్న‌ర్‌ను ఆయా పార్టీలు విమ‌ర్శించిన‌ప్ప‌టికీ...నిబంధ‌న‌ల ప్ర‌కారం త‌ప్పుప‌ట్ట‌లేవు. ఈ నేప‌థ్యంలో...ఇప్పుడు ఇటు సాంకేతిక అంశాలు...అటు గ‌తంలోని తీర్పుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని...సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వ‌నుంద‌నే ఆస‌క్తి నెల‌కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: