మ‌హారాష్ట్రలో పొలిటిక‌ల్ స్ట్రైక్ చేశామ‌ని...మెజార్టీ లేక‌పోయినా..ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశామ‌ని భావిస్తున్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆనందం, క‌మ‌ల‌నాథుల సంబురం స్వ‌ల్ప‌కాలంలోనే ఆవిరైపోయింది. మ‌హారాష్ట్రలో మ‌రో సంచ‌ల‌న ప‌రిణామం చోటుచేసుకుంది. సొంత చిన్నాన్న శ‌ర‌ద్ ప‌వార్ సార‌థ్యంలోని ఎన్‌సీపీకి వెన్నుపోటు పొడిచి బీజేపీకి మద్దతు ప్రకటించి త‌నతో పాటు వచ్చిన 32 మంది ఎమ్మెల్యేల మద్దతుతోనే ఎన్‌సీపీ ముఖ్య‌నేత అజిత్ ప‌వార్ మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించిన విషయం తెలిసిందే. అదే అజిత్ ఇప్పుడు బీజేపీ మైండ్ బ్లాంక్ చేశారు. ఎవరూ ఊహించని విధంగా.. డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఎన్సీపీ నాయకుడు అజిత్‌ పవార్‌...ఇవాళ అదే పదవికి రాజీనామా చేశారు. త‌ద్వారా బీజేపీ నేత‌ల‌కు షాకిచ్చాడు.

 

అజిత్ పవార్ మీద నమోదైన వేల కోట్ల రూపాయల సాగునీటి కుంభకోణానికి సంబంధించిన కేసులను మూసివేసి, ఆయా కేసుల్లో ఆయనకు మహ‌రాష్ర్ట అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) క్లీన్‌చిట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.  1999-2014 మధ్య కాలంలో మహారాష్ర్టలో కాంగ్రెస్-ఎన్సీపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో పలువురు నీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేశారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వాస్తవ రేటును కాదని ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచి చూపిస్తూ అజిత్ పవార్ సాగునీటి కుంభకోణానికి పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. వివిధ ప్రాజెక్టుల టెండర్లు, నిర్వహణలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని నమోదైన పలు కేసుల్లో అజిత్ పవార్ నిందితుడిగా కూడా ఉన్నారు. ఈ కుంభకోణం విలువ రూ. 70 వేల కోట్ల వరకు ఉంటుందని సమాచారం. సాగునీటి కుంభకోణం కేసులో అజిత్ పవార్ జైలుకు వెళ్లడం ఖాయమని, ఆయన జైలులో ఓ ఖైదీగా కష్టపడక తప్పదని బాలీవుడ్ క్లాసిక్ చిత్రం షోలేలోని ప్రఖ్యాత డైలాగ్ చక్కీ పీసింగ్ అండ్ పీసింగ్ అండ్ పీసింగ్ ను ఉటంకిస్తూ ఎన్నికల ప్రచారంలో ఫడ్నవీస్ తీవ్ర ఆరోపణలు చేశారు. అటువంటిది ఇప్పుడు అజిత్ పవార్ మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అజిత్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. ఈ నేపథ్యంలోనే క్రమంగా సాగునీటి కుంభకోణానికి సంబంధించిన కేసులను కూడా సడలించేశారు.

 

అయితే, ఈ కేసుల్లో ఉప‌శ‌మ‌నం ద‌క్కిన మ‌రుస‌టిరోజే...అజిత్ ప్లేటు ఫిరాయించేశాడు. మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం సాయంత్రం 5 గంటల్లోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేప‌టికే ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేసేశారు. ఎన్సీపీ నుంచి అజిత్‌ను శరద్‌ పవార్‌ సస్పెండ్‌ చేయక‌పోవ‌డంతో... ఆయ‌న్ను పార్టీలోకి తీసుకుంటార‌ని తెలుస్తోంది. దీంతో ఎన్‌సీపీ-శివ‌సేన‌-కాంగ్రెస్ స‌ర్కారు ఏర్పాటు కానుంది. బీజేపీ న‌వ్వుల‌పాలు కానుంది.  బలపరీక్ష కంటే ముందే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా తన పదవికి రాజీనామా చేస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాగా...ఇప్ప‌టివ‌ర‌కు అజిత్ త‌మ‌కు వెన్నుపోటు పొడిచాడ‌ని ఎన్‌సీపీ నేత‌లు ఆరోపించ‌గా...ఇప్పుడు ఆ కామెంట్ బీజేపీ నేత‌లు చేస్తార‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: