దాదాపు నెల‌న్న‌ర‌రోజులుగా...దేశం చూపును త‌న‌వైపు తిప్పుకొన్న మ‌హారాష్ట్ర రాజ‌కీయం ఎట్ట‌కేల‌కు ఓ ముగింపు ద‌శ‌కు చేరింది. సంకీర్ణ రాజ‌కీయాల్లోని ఎత్తులు-పై ఎత్తుల‌ను సుప‌రిచితం అయ్యేలా శివ‌సేన ప‌ద‌వి కోసం ఆరాటం, ఎన్‌సీపీ మ‌ద్ద‌తు ప్ర‌య‌త్నాలు..అందులో చీలిక వ‌ర్గం, ఢిల్లీ పార్టీలైన‌ప్ప‌టికీ...గ‌ల్లీ ఎత్తుగ‌డలు వేసిన బీజేపీ, కాంగ్రెస్‌లు ఓ ప్ర‌భుత్వాన్ని దించ‌గ‌లిగాయి. మ‌రో ప్ర‌భుత్వాన్ని కుర్చీలో కూర్చోపెట్ట‌గ‌లిగాయి. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌లో...ముగ్గురు మ‌హిళ‌లు కీల‌క పాత్ర పోషించారు.

 


మొద‌టి మ‌హిళ‌గా శివ‌సేన ర‌థ‌సార‌థి ఉద్ధవ్ థాక్రే సతీమణి రశ్మీ ఠాక్రేను పేర్కొన‌వ‌చ్చని నిపుణులు అంటున్నారు. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా పార్టీ ర‌థ‌సార‌థి ఉద్ద‌వ్ ఠాక్రే త‌న‌యుడు ఆదిత్య ఠాక్రే  పోటీలో దిగారు. ఆదిత్య పోటీ చేయడానికి కారణం ఆయ‌న త‌ల్లి ర‌శ్మీ ఠాక్రే. ఇప్ప‌టివ‌ర‌కు బీజేపీతో క‌లిసి పొత్తు రాజకీయం న‌డిపామ‌ని...ఇక‌నుంచి మ‌నమే అధికారంలో భాగం కావాల‌ని పేర్కొంటూ... ఉద్ధవ్ ఠాక్రేని పోటీ చేయమని ఒత్తిడి తేగా ఆయన ప్రత్యక్ష పోటీకి ససేమిరా అనడంతో తనయుడు ఆదిత్య థాక్రేని ఎన్నికల్లో పోటీకి దింపినట్లు సమాచారం. ఆదిత్య గెలుపొంద‌డంతో, ముఖ్యమంత్రి పదవి శివసేనకిస్తే ఉద్ధవ్ పీఠమెక్కాలని, ఒకవేళ తొలి రెండున్నరేళ్ళు బీజేపీ సీఎం సీటు తీసుకుంటే.. ఆదిత్యను ఉప ముఖ్యమంత్రిని చేయాలని రశ్మీ కండీషన్ పెట్టినట్లు చెబుతున్నారు. దీంతో బీజేపీ త‌న దారి తాను చూసుకుంద‌ని అంటున్నారు. 

 

ఇక మ‌రో మ‌హిళ తాజాగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా ఉదంతంలో కీల‌క పాత్ర పోషించిన నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ శరద్‌ పవార్‌ భార్య ప్ర‌తిభ‌. డిప్యూటీ సీఎం పదవి విష‌యంలో ఎన్సీపీ నేతలు విమ‌ర్శ‌లు చేయ‌డం, ప‌ద‌వికి రాజీనామా చేసి సొంత గూటికి మ‌ద్ద‌తివ్వాల‌ని కుటుంబ స‌భ్యులు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్న విష‌యాలో అజిత్‌ పవార్‌తో స‌మావేశ‌మైన శ‌ర‌ద్ స‌తీమ‌ణి ప్ర‌తిభ స‌వివ‌రంగా వివ‌రించిన‌ట్లు స‌మాచారం. పార్టీలోకి తిరిగి తీసుకునేందుకు వీలుగా ఎన్సీపీ నుంచి అజిత్‌ను సస్పెండ్ చేయలేద‌ని, ఇప్ప‌టికైనా మ‌న‌సు మార్చుకుంటే క‌లిసి పనిచేసుకోవ‌చ్చు ఆమె చెప్ప‌డంతో..అజిత్‌ పవార్ రాజీనామా చేసిన‌ట్లు తెలుస్తోంది. 

 

ఇదిలాఉండ‌గా, మ‌రో ముఖ్య‌మైన వ్య‌క్తి ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే. మ‌హారాష్ట్రలోని  రాజ‌కీయ ప‌రిణామాల‌ను వ్య‌క్తీక‌రిస్తూ...త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తీక‌రించిన తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌న ప‌రిణామంగా...బీజేపీకి  ఎన్సీపీ నేత అజిద్‌ పవార్‌ మద్దతు ఇచ్చి మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. `కుటుంబంలో పార్టీలో చీలిక వ‌చ్చింది`అని తొలి రోజు  వాట్సాప్‌ స్టేటస్ పెట్టిన సుప్రియా సూలే... దానికి కొన‌సాగింపుగా...తాజాగా అజిత్‌ పవార్‌ నిర్ణయాన్ని తప్పుపడుతూ మ‌రుస‌టి రోజు తన వాట్సాప్‌ స్టేటస్‌లో రెండు అంశాలు లేవనెత్తారు.  ``గుడ్‌ మార్నింగ్‌.ఎప్పటికైనా విలువలే గెలుస్తాయి. నిజాయితీ, కష్టం వృధాగా పోవు. నిజాయితీతో పనిచేయడం కొంచెం కష్టమైనా..దాని ఫలితాలు ఎక్కువ కాలం ఉంటాయని’ అప్‌డేట్‌ పెట్టారు. ‘అధికారం వస్తుంటుంది..పోతుంటుందని నేను నమ్ముతా. కానీ వాటికన్నా బంధాలు చాలా ముఖ్యమైనవి’ అని ఒక స్టేటస్‌ అప్‌డేట్‌ పెట్టారు. ఇలా ముగ్గురు మ‌హిళ‌లు మ‌హారాష్ట్ర రాజ‌కీయాలలో కీల‌క పాత్ర పోషించార‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: